26న ఢిల్లీలో ధర్నాకు పిలుపు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ : విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో అదివారం విభజన హామీల సాధన సమితి ఏర్పాటు
చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విభజన హామీల అమలుకు రాష్ట్ర
వ్యాప్తంగా మరో సారి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 16 నుంచి
26 జిల్లాల్లోనూ నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని, 26న ఢిల్లీ లోని
జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. ప్రధాని విశాఖ
పర్యటనలో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మొండిచేయి చూపారని విమర్శించారు. రాష్ట్ర
ప్రభుత్వ నిధులతో లక్షలాది మందిని తరలించి స్వామి భక్తిని చాటుకున్నారని
ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు జరిగే ఏ ఒక్క అంశంపైగాని, సీఎం
ప్రస్తావించిన వాటిపై కానీ మోడీ సమాధానం చెప్పలేదన్నారు. విశాఖ సభ విజయవంతం
కోసం దాదాపు 7 వేల మంది అధికారులను వినియోగించారని అన్నారు. జన సమీకరణకు
కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి రాష్ట్రానికి సాధించిందేమిటో ప్రజలకు
సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సభలో కనీసం సీఎం జగన్ పేరు కూడా ప్రధాని ఎత్తలేదని, ఇంకా మోదీ భజన ఎందుకని
నిలదీశారు. మోదీ ప్రసన్నం కోసం జగన్ పడరాని పాట్లు పడుతున్నారన్నారు. అదే
ప్రధాని, తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కు భయపడి సింగరేణిని ప్రైవేట్ పరం
చేయం అని చెప్పారన్నారు. ఇక్కడ మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయబోమని
ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యులను ఎక్కువ మందిని
గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని, విభజన అంశాలు
అమలయ్యేలా కృషి చేస్తానని 2019 ఎన్నికల్లో జగన్ ప్రగల్భాలు పలికారనీ,
ఇప్పుడేమో తన కేసుల విముక్తి కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి ప్రధాని
మోడీ ఎదుట సాగిలపడే పరిస్థితికి దిగజారారని రామకృష్ణ విమర్శించారు. మోడీ ని
సార్…సార్ అని అటెండర్ మాదిరి అంటూ జగన్ ప్రజల ఆత్మగౌరవాన్ని
దిగజార్చారన్నారు. అంతగా బతిమాలినా విశాఖ రైల్వే జోన్, ఉక్కు ప్రైవేటీకరణ,
విభజన హామీలు అమలు చేసే అంశాలు ఏ ఒక్కదానిపై కూడా ప్రధాని తన ప్రసంగంలో కనీసం
ప్రస్తావించలేదన్నారు. విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్
మాట్లాడుతూ మోడీ సభకు లక్షలాది మంది ప్రజలను బలవంతంగా తరలించారన్నారు. విశాఖ
ఉక్కు ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఉద్యమిస్తూంటే కనీసం
దానిపై మోడీ మాట్లాడలేదన్నారు.
విశాఖలో ప్రారంభించిన ప్రాజెక్టులు అన్నీ అదానీ పరమవుతున్నాయని అన్నారు.
విజయవాడ, విశాఖల్లో మెట్రో ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఏ
ప్రాజెక్టు ప్రారంభించినా గుజరాత్ కు, అదాని,అంబానిలకు ప్రయోజనం చేయటానికి
మాత్రమే అని విమర్శించారు. గతంలో బీజేపీని తీవ్రంగా విమర్శించిన పవన్, మోడీ తో
సమావేశం అనంతరం ఎందుకు సైలెంట్ అయ్యారన్నారు. వామపక్ష నాయకులను అరెస్టు చేస్తే
కనీసం ప్రశ్నించలేదన్నారు. రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ
ఇచ్చారన్నారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహరావు మాట్లాడుతూ
జగన్ రాష్ట్ర ప్రయోజనాలు కంటే స్వప్రయోజనాలు కోసమే ప్రయత్నించారన్నారు.
కాంగ్రెస్పా ర్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే చేస్తామని
రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఫణిరాజ్
మాట్లాడుతూ, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. 26న
ఢిల్లీలో జరిగే అందోళనకు మద్దతుగా విజయవాడలో పెద్దఎత్తున ఆందోళన
చేస్తామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి శంకర్, ఏఐఎస్ఎఫ్
రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, ఎస్ఎఫ్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు
కె.ప్రసన్నకుమార్, డీవైఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న, తాటికొండ
నరసింహారావు పాల్గొన్నారు.