అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ సహా మొత్తం ఆరుగురు దోషులను విడుదల చేయాలని
సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నళిని, ఆమె భర్త
శ్రీహరన్ అలియాస్ మురుగన్, సంథన్, రాబర్ట్ పాయస్, జయకుమార్‌లు శనివారం
సాయంత్రం తమిళనాడులోని ఆయా జైళ్ల నుంచి అధికారికంగా విడుదలయ్యారు. మరో వ్యక్తి
ఆర్పీ రవిచంద్రన్ కూడా త్వరలో విడుదల కానున్నారు. ఇప్పటికే పెరోల్‌పై ఉన్న
నళిని.. తన తప్పనిసరి హాజరు నమోదు కోసం శనివారం ఉదయం స్థానిక పోలీస్
స్టేషన్‌కు వెళ్లారు. అనంతరం వెల్లూరులోని మహిళా ప్రత్యేక జైలుకు
చేరుకున్నారు. లాంఛనాలన్నీ పూర్తయ్యాక అక్కడినుంచి విడుదలయ్యారు. తదనంతరం
సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇక్కడినుంచి విడుదలైన ఆమె భర్త శ్రీహరన్, సంథన్‌కు
కలుసుకున్నారు. ఈ ఇద్దరు శ్రీలంక జాతీయులు కావడంతో పోలీసు వాహనంలో
తిరుచిరాపల్లిలోని శరణార్థి శిబిరానికి తరలించారు. మరోవైపు పుళల్ జైలు నుంచి
రాబర్ట్ పయాస్, జయకుమార్‌లు విడుదలయ్యారు. శ్రీలంక జాతీయులు కావడంతో వీరినీ
అక్కడికే తీసుకెళ్లారు. ఇదే కేసులో దోషిగా తేలి, ఇప్పటికే విడుదలైన
పేరరివాలన్, అతని తల్లి.. అంతకుముందు ఈ ఇద్దరిని జైలు బయట కలిశారు.
తమిళులకు ధన్యవాదాలు :నళిని
ఇది తనకు కొత్త జీవితమని నళిని పేర్కొన్నారు. జైలునుంచి విడుదలయ్యాక ఆమె
తొలిసారి మాట్లాడుతూ ‘నా భర్త, కుమార్తెతో నాకిది కొత్త జీవితం. అయితే, నేను
ప్రజా జీవితంలోకి వెళ్లడం లేదు. 30ఏళ్లకు పైగా మద్దతు ఇచ్చిన తమిళులతోపాటు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు. నా కుమార్తెతోనూ మాట్లాడాను’ అని
ఆమె చెప్పారు. చెన్నైలోనే ఉంటారా? లేదా లండన్‌లో ఉంటున్న కుమార్తె వద్దకు
వెళ్తారా? అనేదానిపై నళిని త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆమె తరఫు లాయర్ ఓ
వార్తాసంస్థకు చెప్పారు. ఆమె భర్త భవితవ్యంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం
తీసుకుంటుందన్నారు. ఇదిలా ఉండగా ఇదే కేసులో 30 ఏళ్లకు పైగా జైలుశిక్ష
అనుభవించిన పేరరివాలన్ విడుదలకు, రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద దఖలు పడిన
అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం మే 18న ఆదేశాలు జారీ
చేసిన విషయం తెలిసిందే. అదే తీర్పు మిగతా ఆరుగురు దోషులకూ వర్తిస్తుందని
జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం స్పష్టం చేసింది.
వారి శిక్షను తగ్గించాలని తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసిన సంగతిని
గుర్తుచేసింది. కారాగారంలో వీరందరి ప్రవర్తన సంతృప్తికరంగా ఉన్నట్లు
తెలిపింది. ఈ క్రమంలోనే నేడు ఐదుగురు విడుదలయ్యారు.