ప్రమాదబీమా పత్రాలు అందజేసిన సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
లోకేష్
గుంటూరు : మంగళగిరి నియోజకవర్గంలో స్వర్ణకారులకు ఏ సమస్య వచ్చినా
పరిష్కరించేందుకు తాను సిద్ధంగా వున్నానని, వారి భవిష్యత్తు బంగారుమయం
చేస్తానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లి
నివాసంలో శనివారం లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు
ప్రమాదబీమా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ
స్వర్ణకారులు ప్రమాదాల బారిన పడితే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని,
ప్రమాద బీమాతో భరోసా కల్పించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటివరకూ
150 మంది లక్ష్మీనరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు తన సొంత
సొమ్ముతో ప్రమాదబీమా చేయించానని పేర్కొన్నారు. మరో 100 మందికి త్వరలోనే
ప్రమాదబీమా అందజేయనున్నట్టు తెలిపారు. పనిప్రదేశంలో సరైన గాలి వెలుతురు లేక,
ఉక్కపోత, కాలుష్యం వల్ల స్వర్ణకారులు అనారోగ్యం బారిన పడుతున్నారని..వీరికి
వైద్య సహాయం కూడా అందించనున్నామని అన్నారు. అనారోగ్యంతో చనిపోయిన స్వర్ణకారుల
కుటుంబాల పిల్లల విద్యావసరాలకు త్వరలో ఆర్థిక చేయూతని అందిస్తామని
అన్నారు.
సొసైటీ సభ్యుల కోరిక మేరకు స్వర్ణకార పనిముట్లు అందజేసేందుకు ప్రణాళిక సిద్ధం
చేస్తున్నామన్నారు. సొసైటీ సభ్యులతోపాటు స్వర్ణకారులు ఎవరికీ ఏ సహాయం
కావాలన్నా, ఏ సమస్య వచ్చినా అండగా వుంటానని భరోసా ఇచ్చారు.