హైదరాబాద్ : ఏ ప్రతిభ లేకున్నా రాజకీయాలు చేయొచ్చని కొందరు భావిస్తున్నారని, అయితే ప్రతిభ లేకుండా రాజకీయాల్లో ఎవరూ రాణించలేరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అంబేడ్కర్ వర్సిటీలో నిర్వహించిన ‘మీడియా ఇన్ తెలంగాణ-పాస్ట్, ప్రసెంట్, ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్య, తెలంగాణ ఉద్యమాల్లో పత్రికలు కీలక పాత్ర పోషించాయి. తెలంగాణ ఉద్యమంలో మీడియా యాజమాన్యాలు మాకు వ్యతిరేకంగా ఉండేవి. ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. తొలినాళ్లలో కేసీఆర్ చిత్తశుద్ధిని కూడా శంకించారు. కేంద్రంలో బీజేపీ , రాష్ట్రంలో టీడీపీని ఎదుర్కొని ఉద్యమం నడిపించాం.సరిగ్గా మాట్లాడలేని నేతలను కూడా పత్రికలు అద్భుతంగా చిత్రీకరించాయని కేటీఆర్ అన్నారు. రాజకీయ వారసత్వంపై స్పందిస్తూ రాజకీయాల్లో ప్రవేశానికి మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుంది. సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారు. నా పనితీరు వల్లే సిరిసిల్లలో మెజారిటీ పెరిగింది. నేను పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు ఎప్పుడో నన్ను పక్కన పెట్టేవారని కేటీఆర్ పేర్కొన్నారు.