విజయవాడ : అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు జారీ చేయాలని
ఏ.పి.యు.డబ్ల్యు.జే. రాష్ట్ర కార్యవర్గసమావేశం డిమాండ్ చేసింది. ఆ మేరకు
శుక్రవారం జరిగిన యూనియన్ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్
యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏ.పి.యు. డబ్ల్యు.జే. ) రాష్ట్ర కార్యవర్గ
సమావేశం శుక్రవారం విజయవాడ గాంధీనగర్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో రాష్ట్ర
అధ్యక్షుడు ఐ.వి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. జర్నలిస్టులకు గతంలో
జారీచేసిన అక్రెడిటేషన్ల గడువు డిసెంబర్ 31 నాటికి ముగియనున్నందున కొత్త
అక్రెడిటేషన్ల జారీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని యూనియన్ డిమాండ్
చేసింది. రాష్ట్ర ,జిల్లా, స్థాయి మీడియా అక్రెడిటేషన్ కమిటీలను వెంటనే
ఏర్పాటు చేయాలని , కమిటీలలో పూర్వం మాదిరిగానే వర్కింగ్ జర్నలిస్టుసంఘాలకు
ప్రాతినిధ్యాన్ని కల్పించాలని యూనియన్ కోరింది.
సెప్టెంబర్ లో గడువు ముగిసిన వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పథకాన్ని
పునరుద్ధరించి అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని యూనియన్
రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. అలాగే గత మూడేళ్ళుగా అమలుకు నోచుకోని
వర్కింగ్ జర్నలిస్ట్ ప్రమాద బీమా పథకం పునరుద్ధరించాలని సమావేశం డిమాండ్
చేసింది. జర్నలిస్టుల తక్షణ సమస్యలపై యూనియన్ ప్రతినిధిబృందం సమాచార పౌర
సంబంధాల మంత్రిని ,కమిషనర్ ను కలిసి సమస్యలను వివరించాలని , కార్యవర్గ
సమావేశం నిర్ణయించింది. అవసరమైతే సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టాలని
సమావేశం భావించింది. నవంబర్ 16 వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని వివిధ
రూపాలలో నిర్వహించాలని సమావేశం జిల్లాశాఖలకు , అనుబంధ ప్రెస్ క్లబ్ లకు పిలుపు
ఇచ్చింది.
రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐ.జే.యూ జాతీయ అధ్యక్షుడు
కే. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం మీడియారంగం , పాత్రికేయులు
క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నారని , వారికి రక్షణ కరువయ్యిందని
అన్నారు. పత్రికాస్వేచ్ఛకు మున్నెన్నడూ లేని ప్రమాదం ఎదురవుతోందని , పాలకులు
పాత్రికేయుల గొంతు నొక్కుతున్నారనీ , తీవ్రమైన అభియోగాలు మోపి జర్నలిస్టులను
అరెస్టుచేసి జైళ్ళపాలు చేస్తున్నారని శ్రీనివాసరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దుచేసి తెచ్చిన లేబర్ కోడ్ వల్ల
జర్నలిస్టుల హక్కులకు విఘాతం కలుగుతోందని అన్నారు. “సేవ్ జర్నలిజం – సేవ్
జర్నలిస్ట్స్” నినాదంతో జనవరిలో జాతీయ స్థాయిలో ప్రచారాందోళన చేపట్టాలని
ఇటీవల చెన్నైలో జరిగిన ఐ.జే.యు జాతీయ పదవ ప్లీనరీ నిర్ణయం తీసుకుందని
శ్రీనివాసరెడ్డి వివరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు మేలుచేసే చర్యలు
తీసుకుంటారని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తాము పెట్టుకున్న ఆశలు
అడియాసలయ్యాయని, గతంతో పోలిస్తే రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు మరింతగా
దిగజారాయని శ్రీనివాసరెడ్డి అన్నారు.
సంఘటిత ఉద్యమాల ద్వారా సమస్యల పరిష్కారం కోసం యూనియన్ కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర యూనియన్ కార్యకలాపాల పై ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్ నివేదికను
సమావేశం ముందుంచారు.
సమావేశంలో ఐజేయు జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు , జాతీయ కార్యవర్గసభ్యులు
ఆలపాటి సురేష్ కుమార్ , డి.సోమసుందర్ , రాష్ట్ర కార్యదర్శి ఏ.జయప్రకాష్ ,ఫోటో
జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.హెచ్. సాంబశివరావు , విజయవాడ ప్రెస్
క్లబ్ అధ్యక్షుడు ఎన్.వి. చలపతిరావు , రాష్ట్ర కార్యవర్గసభ్యులు
లక్ష్మీనారాయణ , చావారవి , ఏ.సురేష్ , పి.భక్తవత్సలం , ఏ.కే. మోహన్ రావు ,
కే.శేషశాయి , యు. వెంకట్రావు , డి.అచ్యుతరావు , తదితరులు జర్నలిస్టుల సమస్యలపై
మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు
, కొత్త జిల్లాల కన్వీనర్లు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో ఇటీవల
కన్నుమూసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి రాము ,ఇతర పాత్రికేయుల , కుటుంబ
సభ్యుల మృతికి ప్రగాఢసంతాపం తెలిపింది.
నివాళి: ఇటీవల కన్నుమూసిన సీనియర్ పాత్రికేయులు , యూనియన్ పూర్వాధ్యక్షులు
జి.ఎస్. వరదాచారి ,సీనియర్ పాత్రికేయులు కే.ఎల్.రెడ్డి సంతాప కార్యక్రమాన్ని
తొలుత ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఐ.జే.యు. అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి
, యూనియన్ పూర్వ అధ్యక్షుడు జి.ఉపేంద్ర బాబు , యూనియన్ నాయకులు అంబటి
ఆంజనేయులు , ఆలపాటి సురేష్ కుమార్, డి.సోమసుందర్ ,ఐ.వి సుబ్బారావు ,చందు
జనార్ధన్ , రాష్ట్ర కార్యవర్గసభ్యులు వరదాచారి ,కే.ఎల్.రెడ్డి చిత్రపటాలకు
పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారిసేవలను స్మరించుకున్నారు. రెండు నిముషాల
మౌనం పాటించారు. వారి జీవిత విశేషాలను ,పత్రికా రంగానికి చేసిన సేవలను
కే.శ్రీనివాసరెడ్డి వివరించారు.