ఏపిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ సూటి ప్రశ్న
కర్నూలు : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు రావడం ఇది
రెండోవసారి అని ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలో తీసుకొచ్చిన ప్రధాని మోడీకి జగన్
రెడ్డి ప్రభుత్వం ఘనస్వాగతం పలకడం విడ్డూరంగా ఉందని శైలజనాథ్ విమర్శించారు.
విభజన చట్టాలను అమలు చేయాలని, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక
ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన
వ్యక్తి మోడీ అని అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడటం
ప్రజలను మభ్యపెట్టడం భావ్యం కాదన్నారు. మాటమీద నిలబడలేని వ్యక్తి
చేతకానితనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా ఇచ్చింది
కాంగ్రెస్ పార్టీ దానిని అమలు చేయాల్సిన బాధ్యత బిజెపి అని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాక సందర్భంగా సంకలు గుద్దుకొని ఏర్పాట్లు
చేయడం జగన్ రెడ్డి కి ఎలా మనసు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డి
లొంగుబాటుతనం ఎంత కాలం? ఎంతవరకు..? నోరున్న మూగవాడిలా మౌనంగా ఉంటూ తెలుగు
ప్రజలను మోసం చేసినట్లేనని ఆయన అన్నారు. తనకు ఎంపీ స్థానాలను ఎక్కువ ఇస్తే
ప్రత్యేక హోదా తెస్తా… బిజెపి మెడలు వంచుతా అని ఉత్తర కుమారుని ప్రగల్బాలు
పలికిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు
చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నేను ప్రశ్నిస్తున్న అంటూ ప్రజల్లోకి
వస్తున్న పవన్ కళ్యాణ్ ఆయన ప్రశ్నిస్తున్న తీరును ప్రజలకు అర్థం కాక అయోమయంలో
పడ్డారని శైలజనాథ్ ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని, వెనుకబడిన
ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీతో
మాట్లాడేందుకు కూడా భయపడే నాయకులు మన రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటు అన్నారు.
మోడీని నిలదీయండి అని మరోసారి శైలజనాథ్ డిమాండ్ చేశారు. మోడీ వస్తున్న
సందర్భంగా తెలుగు ప్రజల డిమాండ్లను నెరవేర్చి ఈ రాష్ట్రం నుండి వెళ్లిపోవాలని
ఆయన డిమాండ్ చేశారు .ఈరోజు మోడీ రాక సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని
జిల్లాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడుతున్నామని అందులో
భాగంగానే కర్నూలుకు రావడం జరిగిందన్నారు.
ఆనాడు జాతీయ సంస్థలను
కాంగ్రెస్ పార్టీ స్థాపిస్తే నేడు ఆ జాతీయ సంస్థలను ప్రైవేటుకరించేందుకు మోడీ
ప్రయత్నించడం మానుకోవాలన్నారు. అదేవిధంగా అమరావతి నే రాజధానిగా ఉంటుందని
ప్రకటించాలని, ఆనాడు నీరు, మట్టి తీసుకొని వెళ్లి నేడు మౌనంగా ఉండటం భావ్యం
కాదన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సుధాకర్ బాబు వివిధ నియోజకవర్గాల
ఇన్చార్జులు మహిళా నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల ఇన్చార్జిలు పాల్గొని మోడీ
గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.