అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న హబుల్ టెలిస్కోప్
పేలిపోయిన నక్షత్రం సూర్యుడి కంటే 530 రెట్లు పెద్దది
భూ దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ అంతరిక్షంలోని అద్భుత ఘట్టాలను
ఆవిష్కరిస్తున్న నాసా హబుల్ టెలిస్కోప్ మరో కీలక దృశ్యాన్ని గుర్తించింది.
పరిమాణంలో సూర్యుడి కంటే కొన్ని వందల రెట్లు పెద్దదైన ఓ నక్షత్రంలో సంభవించిన
భారీ విస్ఫోటనాన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. ఈ నక్షత్రం సూర్యుడి
కంటే 530 రెట్లు పెద్దది. ఇది విస్ఫోటనం (సూపర్ నోవా) చెందుతూ, దానిలోని
వాయువులను విశ్వంలోకి వ్యాపింపజేస్తూ మృత నక్షత్రంగా మారిపోయింది. ఈ సూపర్
నోవా 11 వందల కోట్ల సంవత్సరాల నాటి పేలుడు అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ఆ నక్షత్రం బాహ్యవాతావరణ పొరలు అన్నీ గ్యాస్ మయం అని, ఈ పొరలు భగ్గుమని
మండిపోయి విశ్వాంతరాళాల్లోకి వ్యాపించినట్టు హబుల్ టెలిస్కోప్ రికార్డు చేసిన
డేటా చెబుతోంది. హబుల్ టెలిస్కోప్ ఈ సూపర్ నోవాను ఎనిమిది రోజుల వ్యవధిలో మూడు
చిత్రాలుగా రికార్డు చేసింది. దీనికి సంబంధించిన అధ్యయనం తాజాగా జర్నల్ నేచుర్
అనే పత్రికలో ప్రచురితమైంది.