ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించిన వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ వై వి
సుబ్బారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి
గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం : రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వస్తున్న ప్రధాని నరేంద్ర
మోడీకి రాష్ట్ర ప్రభుత్వo తరపున ఘన స్వాగతం పలకడంతో పాటు, ఆంధ్ర యూనివర్సిటీ
ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 12వ తేదీన మూడు లక్షల మందితో ప్రధాని బహిరంగ సభ
నిర్వహించనున్నామని పార్లమెంటరీ పార్టీ నాయకులు, ఎంపీ విజయసాయిరెడ్డి
తెలియజేశారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, తిరుమల
తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
గుడివాడ అమర్నాథ్ తో కలిసి గురువారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం వారు
మీడియాతో మాట్లాడుతూ, విశాఖ, అనకాపల్లి జిల్లాలో నుంచి ప్రధాని సభకు రెండు
లక్షల మంది హాజరవుతారని, శ్రీకాకుళం, విజయనగరం, ఏఎస్ఆర్ జిల్లాల నుంచి సుమారు
లక్ష మంది జనం హాజరు కానున్నారని చెప్పారు. సుమారు 30 ఎకరాల ప్రాంగణంలో
ప్రధాని సభా కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా 15వేల కోట్ల
రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారని
తెలియజేశారు.
ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంతగానో
ఉపయోగపడతాయని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇది రాజకీయ సభ, ఎన్నికల సభ కాదని
విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోదీ,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి కృషి చేస్తున్నారని విజయసాయిరెడ్డి
వివరించారు. విశాఖ రైల్వే జోన్ విషయమై ప్రధానితో చర్చించనున్నామని విలేకరులు
అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు
శంకుస్థాపన చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై
నిర్ణయం తీసుకోవడానికి సమయం చాలకపోవడంతో, ప్రధాని ప్రస్తుత పర్యటనలో ఈ
కార్యక్రమం లేదని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ
కార్మికులు చేస్తున్న ఆందోళనను విలేకరులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకురాగా
,విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తమ పార్టీ ముందు నుంచి
వ్యతిరేకిస్తోందని, ప్రైవేటీకరణను నిరసిస్తూ ముందుగా పాదయాత్ర చేసింది తామేనని
విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని మాకన్నా
బిజెపి వాళ్ళని అడిగితే బాగుంటుందని విజయసాయి రెడ్డి సూచించారు.
స్టీల్ ప్లాంట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రూపాయి వాటా కూడా లేదని, ఇది
పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిందని, అందువలన దీనిపై పూర్తి హక్కులు
కేంద్రానికే ఉంటాయని, ఈ విషయాన్ని వారిని అడగాలని విజయసాయిరెడ్డి మీడియాకు
సూచించారు. ఇలా ఉండగా, 15 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు,
ప్రారంభోత్సవాలు చేయడం ప్రధాని హోదాకు సరిపోదని తెలుగుదేశం పార్టీ నాయకులు
పేర్కొన్న విషయాన్ని విలేకరులు విజయసారెడ్డి దృష్టికి తీసుకురాగా, ఐదు లక్షల
కోట్ల రూపాయల అక్రమార్జన చేసిన చంద్రబాబు నాయుడుకి, 15వేల కోట్లు రూపాయలు
తక్కువగానే కనిపిస్తాయని విమర్శించారు. ప్రధాని సభ ప్రాంగణంలో ఉన్న చెట్లను
తొలగించామని వస్తున్న విమర్శలపై విజయసాయి రెడ్డి సమాధానం ఇస్తూ, చట్ట
విరుద్ధంగా తామేమీ చేయలేదని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్
మల్లికార్జున, విశాఖ ఎంపీ ఎం వివి సత్యనారాయణ, విశాఖ ఉత్తరం నియోజకవర్గ
ఇన్చార్జి కేకే రాజు, మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యే నాగిరెడ్డి,
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ పలువురు
నాయకులు, అధికారులు పాల్గొన్నారు.