రైతన్నలకు అండగా ఉండేలా ఆర్బీకేలను నెలకొల్పిన సీఎం జగన్
వీటి ద్వారా వ్యవసాయంలో అన్నదాతకు సహాయ సహకారాలు
డిజిటల్ కియోస్క్‌ల ద్వారా రైతు ఇంటి ముంగిటకే ఇన్పుట్స్
ఇతరత్రా వ్యవసాయ సేవలూ అందిస్తున్న రైతుభరోసా కేంద్రాలు
గ్రామాల్లోనే పంట ఉత్పత్తుల కొనుగోలుతో రైతుకు మరింత మేలు
ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న వ్యవస్థ
ఇప్పటికే ఇథియోపియాలో అమలుకు చర్యలు
అమరావతి : వ్యవసాయంలో రైతన్నలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలందించేందుకు,
నాణ్యమైన ఇన్పుట్స్, సాగుకు సంబంధించి అన్ని రకాల ఇతర సేవలు అందించేందుకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత వ్యవస్థ
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు). రాష్ట్ర వ్యవసాయ రంగంలో
అత్యున్నత ఫలితాలు ఇస్తున్న ఈ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఈ
వ్యవస్థ ఏర్పాటుకు ఇప్పటికే ఇథియోపియా దేశం రాష్ట్ర అధికారుల సహకారం
తీసుకుంటోంది. దేశంలోని పలు రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ఏర్పాటుకు ఆసక్తి
చూపిస్తున్నాయి. ఆ రాష్ట్రాల అధికార బృందాలు రాష్ట్రానికి వచ్చి ఆర్బీకేలు,
డిజిటల్ కియోస్క్‌లపై అధ్యయనం చేశాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తరహా
వ్యవస్థను దేశవ్యాప్తంగా నెలకొల్పడానికి చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
(ఐఏఆర్ఐ–పూస)లో ప్రారంభమైన మూడు రోజుల 5వ ఇండియా అగ్రి బిజినెస్
సమ్మిట్–2022 సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్
సింగ్ కులస్తే ఈ విషయం చెప్పారు. సదస్సులో భాగంగా నిర్వహించిన జాతీయ అగ్రి
ఎక్స్‌పోలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన ఆర్బీకేల నమూనా, డిజిటల్
కియోస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్బీకే ద్వారా అందిస్తున్న సేవలు,
డిజిటల్ కియోస్క్‌ల పనితీరును కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్‌తో పాటు
ఫిలిప్పైన్స్ వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి విలియం దార్, రోమన్ ఫోరమ్
ప్రెసిడెంట్ మహారాజ్ ముతూ, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్
చైర్మన్ డాక్టర్ ఎంజే ఖాన్, సలహాదారు ఎన్కే దడ్లాని, నేషనల్ రెయిన్‌ఫెడ్
ఏరియా అథారిటీ (ఎన్ఆర్ఏఏ) సీఈవో అశోక్ దాల్వాయి తదితరులు అడిగి
తెలుసుకున్నారు.
ఆర్బీకేల ద్వారా ఏపీ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలను తెలుసుకొని
ఆశ్చర్యపోయారు. ఆర్బీకే సేవలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, ఇదే తరహా సేవలను
దేశవ్యాప్తంగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు
వేస్తోందని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చెప్పారు. ఆర్బీకేలు,
వాటిలోని కియోస్క్‌లు వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకొచ్చే వినూత్నమైన
పరిజ్ఞానమని ఆయన కొనియాడారు. ‘ఏపీ ఆర్బీకేల గురించి చాలా వింటున్నాం. వాటి
ద్వారా అందిస్తున్న సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్బీకేల్లో డిజిటల్
కియోస్క్‌ల ద్వారా ఇన్పుట్స్ బుకింగ్ విధానం అద్భుతం. వాటిని జాతీయ
స్థాయిలో రైతులకు అందుబాటులోకి తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేను
ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో వీటిని గ్రామ
స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు
కార్యాచరణ సిద్ధం చేయాలని, డిసెంబరుకల్లా డిజిటల్ కియోస్క్‌ల ఏర్పాటుకు
చర్యలు తీసుకోవాలని సదస్సుకు వచ్చిన మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు
కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
రైతు ముంగిటకే విత్తన సరఫరా భేష్ : కేంద్ర మంత్రి సంజీవ్‌కుమార్ బల్యాన్,
నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్‌చంద్ ప్రశంసలు
నాణ్యమైన ధ్రువీకరించిన విత్తనాలను గ్రామ స్థాయిలో రైతుల ముంగిటకే అందించడం
వినూత్న ఆలోచన అని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక శాఖల సహాయ మంత్రి సంజీవ్
కుమార్ బల్యాన్, నీతి ఆయోగ్ సభ్యుడు (వ్యవసాయం) రమేష్ చంద్ ప్రశంసించారు.
విత్తన పంపిణీలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని
చెప్పారు. మూడేళ్లలో 50.95 లక్షల మందికి 34.97 లక్షల క్వింటాళ్ల విత్తనాలను
అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయడం నిజంగా గొప్ప విషయమన్నారు. వ్యవసాయ రంగంలో
విశేష ప్రతిభ కనబర్చిన సంస్థలకు ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్
అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) ఏటా అందించే ఇండియా అగ్రి బిజినెస్ అవార్డుల్లో
విత్తన పంపిణీ కేటగిరీలో ఏపీ సీడ్స్‌కు గ్లోబల్ అగ్రి అవార్డును
అందించింది.
ఇండియా అగ్రి బిజినెస్ సమ్మిట్‌లో ఈ అవార్డును
సంజీవ్‌కుమార్ బల్యాన్, రమేష్‌చంద్ చేతుల మీదుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ
స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్
పి.హేమసుష్మిత, ఎండీ డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు అందుకున్నారు.ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ విత్తన పంపిణీలో ఏపీ అనుసరిస్తున్న విధానాన్ని జాతీయ స్థాయిలో
అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. ఇదే ఆలోచనతో కేంద్రం పీఎం
కిసాన్ సమృద్ధి కేంద్రాలను తీసుకొచ్చిందని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కూడా
ఏపీ బాటలోనే విత్తన పంపిణీని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.