అమరావతి : విశాఖపట్నం గురించి ఇంతటి స్ధాయిలో చర్చ ఎపుడూ సాగలేదు. అది కూడా
ప్రస్తుతం సానుకూలంగానే సాగుతోంది. విశాఖ అంతర్జాతీయ నగరం. దాని ఖ్యాతి
విఖ్యాతి గురించి అందరికీ తెలుసు. ఒక విధంగా జగమెరిగిన నగరం. రాజసానికి లోటు
లేదు, రాచఠీవికి కొరత లేదు. ఇప్పటికి నూటా పాతికేళ్ల నుంచి జిల్లాగా
భాసిల్లుతున్న విశాఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. అటువంటి
విశాఖకు రాజధాని హోదా ఎపుడో వచ్చి ఉండాలి. కానీ భౌగోళిక, సామాజిక, రాజకీయ
కారణాల వల్లనే ఆ సౌభాగ్యం దక్కలేదు అన్నది వాస్తవం. భౌగోళికంగా చూస్తే విశాఖ
ఆంధ్ర రాష్ట్రంలో ఓ చివరన విసిరేసినట్లుగా ఉంటుంది. ఇక సామాజికంగా చూస్తే
ఇక్కడ బలహీన వర్గాలే అత్యధికంగా ఉంటారు. రాజకీయంగా ఆలోచిస్తే స్ధానికంగా
విశాఖను సొంతం చేసుకుని గట్టిగా గొంతెత్తి నినదించే నాయకులు లేరు. అందుకే
విశాఖ అన్నీ ఉండి కూడా ఏమీ కానిదైంది. 2014లో రాష్ట్ర విభజన తరువాత అందరి
చూపూ విశాఖ మీదనే ఉంది. విశాఖను రాజధానిగా చేసుకుంటే హైదరాబాద్‌కు దీటైన నగరం
అందుబాటులోకి వస్తుందని అంతా అంచనా వేశారు.
హైదరాబాద్‌కు లేనిది, విశాఖకు ఉన్నది సీ కనెక్టివిటీ. ఆ విధంగా చూస్తే ముంబై
సరిసాటి అవుతుందని కూడా లెక్కలేశారు. చిత్రంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు
విశాఖలోనే తన తొలి మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటుచేసి ఆశలను మరింతగా
పెంచారు. అయితే తెలుగుదేశం అధినాయకత్వం మదిలో విజయవాడ గుంటూరు ప్రాంతమే
ఉంటుందని అప్పటికే అందరికీ తెలుసు. అయినా సరే విశాఖను రాజధానిగా చేయమని నాడు
సంతకాల సేకరణ చేపట్టారు. చివరికి అమరావతి అని కొత్త నగరాన్ని నిర్మించడానికే
నాటి ప్రభుత్వం సంకల్పించింది. విశాఖ కూడా సర్దుకుని పోయింది. అయితే వైసీపీ
అధికారంలోకి రావడం మూడు రాజధానుల నినాదం అందుకోవడంతో మరోమారు విశాఖలో ఆశలు
మొలకెత్తాయి. ఈసారి అడగకుండానే పరిపాలనా రాజధానిగా విశాఖను చేస్తామని
ముఖ్యమంత్రి జగన్ నిండు శాసనసభలో ప్రకటించి ఆశ్చర్యచకితులను చేశారు.
విశాఖను రాజధానిగా ఎందుకు చేయాలన్న చర్చ ఓ వైపు వైసీపీ బలంగా ప్రజలలోకి
తీసుకునివెళ్తోంది. వైసీపీ మంత్రులు ఈ విషయంలో ముందుండి విశాఖ రాజధాని ఆవశ్యకత
ఈ ప్రాంతానికి ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉందని
చెబుతున్నారు. సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే చెన్నై, హైదరాబాద్,
వంటి నగరాలు ఆ రాష్ట్రానికి మధ్యన ఉన్నాయా అన్న తార్కికమైన ప్రశ్నను
లేవలెత్తారు. రాజధాని అంటే అందరూ కలసి ఉండే నగరంగా ఉండాలని, సమాన అవకాశాలు
ఉండాలని ఆయన మరో నిర్వచనం చెబుతూ దానికి తగిన అర్హతలు విశాఖకు ఉన్నాయని
వివరించారు. రాజధానిగా చెప్పబడుతున్న అమరావతిలో మొత్తం ఒక సామాజికవర్గం
పెత్తనమే సాగే పరిస్థితి నెలకొని ఉందని ధర్మాన పేర్కొనడం విశేషం. భిన్న మతాలు,
ప్రాంతాలు, దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రజానీకంతో అలరారుతున్న విశాఖ
రాజధానిగా నూరుపాళ్లూ సరైనది అని ఆయన అంటున్నారు.
విశాఖ ఆర్ధికంగా కూడా రాష్ట్రానికి ఛోదక శక్తిగా మారుతుందని శ్రీకాకుళం జిల్లా
అంబేద్కర్ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి లాలా లజపతిరాయ్ అంటున్నారు.
రాజధాని వస్తే కచ్చితంగా తలసరి ఆదాయం సమీప ప్రాంతాలకు అన్నింటికీ పెరిగే
అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. విశాఖ రాజధాని అంటే ఆంధ్ర రాష్ట్రానికే
గర్వకారణంగా ఉంటుందని, కేవలం అయిదు నుంచి పదేళ్లలోనే ఆంధ్రా అన్ని విధాలుగా
ప్రగతి సాధించేలా విశాఖ ఆర్ధిక స్తోమతను అందిస్తుందని విద్యావేత్తలు, మేధావులు
అంటున్నారు. ఇలా మంత్రులు ఎమ్మెల్యేలు, విశాఖ రాజధానిని కాంక్షించే వారు ఓ
వైపు అనుకూలతలు చెబుతూంటే మరో వైపు విపక్షాలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ
నాయకులు అయితే విశాఖ రాష్ట్రానికే అగ్ర స్ధానంలో ఉన్న నగరమని కితాబు ఇస్తూనే
అమరావతి మన రాజధానిగా ఉండాలని అంటున్నారు.
విశాఖను టీడీపీ తక్కువ చేయలేదని ఐటి హబ్‌గా తీర్చిదిద్దిందని, రానున్న కాలంలో
పర్యాటక నగరంగా కూడా మారుతుందని చెబుతున్నారు. ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా
విశాఖ రాజధాని అయినా కాకపోయినా మహానగరమే అని చెబుతూ ప్రశాంతతతో పాటు అందమైన
సిటీగా అభివర్ణిస్తున్నారు. అయితే విశాఖ ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని
చెబుతూ తెలుగుదేశం అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పడమే కొసమెరుపు. ఇవన్నీ
పక్కన పెడితే విశాఖ రాజధాని గురించి గతంలో జరిగిన చర్చ కన్నా రాజకీయ రచ్చ
మూలంగా ఈసారి పదింతలు చర్చ సాగుతోంది. ఓ విధంగా ఇది ఆంధ్ర రాష్ట్రమంతటా చర్చకు
తావిస్తోంది. నిజానికి అమరావతి రాజధాని అన్నది లక్షల కోట్లు పెడితేనే తప్ప
తయారుకాదు. అదే విశాఖ అయితే రెడీమేడ్ రాజధానిగా కళ్ల ముందుంది. ఈ చర్చల
ఫలితంగా అయిదు కోట్ల ఆంధ్రుల మనసులలో ఈ ధర్మ సూక్ష్మం కనుక గట్టిగా నాటుకుంటే
విశాఖ రాజధాని అవడానికి ఇప్పటిదాకా ఏర్పడిన అవరోధాలు అన్నీ పటాపంచలైపోతాయని
అంటున్నారు.