ఓటరుగా నమోదు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు
పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఆర్ సిఎం స్కూల్ ఆవరణలో ఓటుహక్కు నమోదు పై
అవగాహనా ర్యాలీని ప్రారంభించారు. ఓటరు నమోదు అవగాహనా ర్యాలీ అర్ సి ఎం స్కూల్
నుండి మూడు రోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఓటరుగా నమోదు
అవ్వండి – తలరాతను మార్చండి, మార్పు కావలంటే తప్పనిసరిగా ఓటు వేయాలి తదితర
నినాదాలతో ప్రజలను చైతన్యపరుస్తూ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా డి ఆర్ ఓ
మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి కీలకమని అన్నారు. 18
సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఓటు హక్కు నమోదు
చేసుకోవాలని కోరారు. 17 సంవత్సరాలు పైబడిన యువత ఓటర్ల జాబితాలో పేర్లను
నమోదుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ
నాటికి 18 సంవత్సరాలు పూర్తి కావాలనే నిబంధన కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని
ఆయన అన్నారు. జనవరి 1వ తేదీ మాత్రమే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ
తేదీల నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత ముందస్తు దరఖాస్తులను దాఖలు
చేయడానికి వీలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు.
ఇకపై ఓటర్ల జాబితాను ప్రతీ త్రైమాసికంలో తాజా పరచడం జరుగుతుందని ఆయన
పేర్కొన్నారు. అర్హులైన యువత నమోదు చేసుకున్న అనంతరం వారికి ఓటరు ఫొటో
గుర్తింపు కార్డు (ఐపిఐసి)ను జారీచేస్తారని ఆయన చెప్పారు. 2023 ఓటర్ల జాబితా
వార్షిక సవరణలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమంలో 2023
సంవత్సరం ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు
పూర్తి చేసుకునే వారు ఓటరుగా నమోదు కావడానికి ముందస్తుగా దరఖాస్తు
సమర్పించవచ్చని ఆయన సూచించారు. యువకులు ఫారం -6 నింపి ఓటరుగా నమోదు చేసుకునే
అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని తెలిపారు. ఎన్నికల ఓటరు ముసాయిదా
తయారుకానున్న దృష్ట్యా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని
అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో అతిపెద్ద పాత్ర ఓటర్ల దని బాధ్యతగల
ప్రతి పౌరుడు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
దేశాభివృద్ధికి, పటిష్ట ప్రజాస్వామ్యానికి ఓటుహక్కు ఎంతో కీలకమని అన్నారు.
యువత నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి ఓటుహక్కు వినియోగించుకొనెలా చైత్యం
తీసుకురావాలన్నారు. అనంతరం అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఓటరుగా నమోదు చేసేందుకు
ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ
అధికారి డా. బగాది జగన్నాథ రావు, ఆర్ బీ ఎస్ కే జిల్లా సమన్వయ అధికారి డా. ధవళ
భాస్కరరావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు,
జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ జాగరపు
రామఅప్పల నాయుడు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జి.వరహాలు, జిల్లా ప్రజా
రవాణా అధికారి టి.వి.ఎస్.సుధాకర్, క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు,
జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి పి.
సీతారాం, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ఉమామహేశ్వర రావు, జిల్లా ప్రణాళిక
అధికారి వీర్రాజు, జిల్లా భూగర్భ జలాల అధికారి కె.రాజశేఖర రెడ్డి,
విద్యార్ధినీ, విద్యార్థులు, తహశీల్దార్ శివన్నారాయణ, విద్యార్థులు, సిబ్బంది,
తదితరులు పాల్గొన్నారు