విశాఖపట్నం : ఈ నెల 12న విశాఖలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ,
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిల బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం గా
కొనసాగుతున్నాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాజ్యసభ సభ్యులు, వైకాపా
పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మంత్రి అమర్ నాథ్ తో కలిసి
పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు సలహాలు
అందించారు. మరోవైపు విశాఖ చరిత్రలోనే పెద్ద ఎత్తున జరుగుతున్న భారీ బహిరంగ సభ
కావడంతో ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు
పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రానుండడంతో
ఎక్కడా ఎటువంటి అసౌకర్యానికి తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను
సూచించారు. ఇంజనీరింగ్ కాలేజీ ప్రధాన గ్రౌండుకు ఆనుకొని ఉన్న ఖాళీ ప్రదేశాలను
సైతం చదును చేసి సభ ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల
కన్నబాబు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, జీవీఎంసీ
కమిషనర్ రాజాబాబు, పలు శాఖల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు
పాల్గొన్నారు.
ప్రధాని సభ విజయవంతం యజ్ఞంలా చేపట్టాలి :
దేశ ప్రధాని నరేంద్ర మోడీ , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిల బహిరంగ సభ విజయవంతం
ఓ యజ్ఞంలా చేపట్టాలని ఎంపీ విజయసాయి రెడ్డి కోరారు. ఈ మేరకు బహిరంగ సభకు
సంబంధించిన ఏర్పాట్లలో భాగంగా ఎస్. ఆర్ షాపింగ్ మాల్, సీఎంఆర్ షాపింగ్ మాల్
లకు చెందిన వలంటీర్లతో స్థానికంగా ఓ హోటల్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు చెందిన 13
నియోజకవర్గాల నుంచి ప్రజలు వాహనాల్లో తరలిరానున్నారని, ఈ సమయంలో వారికి అన్ని
విధాలా సహకరిస్తూ కంట్రోల్ రూంతో సమన్వయం చేసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా
గతంలో పలుకార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం చేశారని ఆ విషయం ఎప్పటికీ తాను
మర్చిపోనని గుర్తు చేసుకున్నారు. ఎస్. ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మొత్తం
500 మంది వలంటీర్లు వారికి కేటాయించిన ప్రాంతాలకు బుధవారం రోజునే చేరుకుంటారని
అన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో వాహనాలు బయలు దేరు సమయం, ఆయా
వాహనాల్లో ఎంతమంది ఉన్నది మొదలగు వివరాలు అప్ లోడ్ చేస్తారని అన్నారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటారని
అన్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు, బ్రాహ్మణ
కార్పొరేషన్ చైర్మెన్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వైకాపా అభ్యర్థి
సీతంరాజు సుధాకర్, ఎస్ ర్ షాపింగ్ మాల్ యాజమాన్య ప్రతినిధి ప్రసాద్ రెడ్డి,
వలంటీర్లు పాల్గొన్నారు.