ఉక్రెయిన్ చేతికి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు
కీవ్ : క్షిపణులు, ఇరాన్ డ్రోన్లతో రష్యా విరుచుకుపడుతోన్న వేళ
ఉక్రెయిన్‌కు మరిన్ని అత్యాధునిక ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా
ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ లు ఆ దేశ అమ్ములపొదిలో చేరాయి. పశ్చిమ మిత్ర దేశాల
నుంచి ఈ గగనతల రక్షణ వ్యవస్థలు అందుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
కొంతకాలంగా ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా మాస్కో చేపడుతోన్న దాడులను
తిప్పికొట్టేందుకు ఈ ఆయుధాలు సహాయపడతాయని పేర్కొంది. ‘నేషనల్ అడ్వాన్స్డ్
సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ సిస్టమ్స్(ఎన్‌ఏఎస్‌ఏఎంఎస్)’తోపాటు ఆస్పైడ్
అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఉక్రెయిన్‌కు చేరుకున్నాయి. ఈ ఆయుధాలు
దేశ సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
గగనతలాన్ని సురక్షితంగా మార్చుతాయి. మాపై దాడి చేస్తున్న శత్రు లక్ష్యాలను
కూల్చివేస్తూనే ఉంటాం’ అని ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికొవ్
పేర్కొన్నారు. ఇందులో భాగస్వాములైన నార్వే, స్పెయిన్, అమెరికాలకు
ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. గత నెల రోజుల వ్యవధిలో రష్యా దాడుల్లో
ఉక్రెయిన్‌లోని మూడింట ఒక వంతు విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. దీంతో
వందలాది పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి. దేశ రాజధాని కీవ్ చుట్టూ
విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని అధికారులుతెలిపారు.
వీలైనంత వరకు విద్యుత్‌ను ఆదా చేయాలని ప్రజలను కోరారు. ఇదిలా ఉండగా రష్యా
దాడులను ఎదుర్కొనేందుకుగానూ తమకు ఆయుధాలు సరఫరా చేయాలని ఉక్రెయిన్ మొదటినుంచి
విజ్ఞప్తి చేస్తోన్న విషయం తెలిసిందే.