విశాఖపట్నం : రాజధాని అమరావతికి తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ రాష్ట్ర
అధ్యక్షులు సోము వీర్రాజు స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ
రాష్ట్ర రాజధానిపై తమ వైఖరిని స్పష్టంగా చెప్పామన్నారు. ప్రతిపక్షంలో
అమరావతికి మద్దతు ఇచ్చి మూడు రాజధానులు అంటున్న జగన్ ను ప్రశ్నించాలన్నారు. ఈ
అంశంపై తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని సోము వీర్రాజు అన్నారు.
స్టీల్ ప్లాంట్‌ని అదానికి అమ్మేసిన వారిని ప్రశ్నించండి
మీడియా పై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
రోజు అబద్దాలు అడేవారు, అవినీతి పరులు చేసే వ్యాఖ్యలపై తమను ఎందుకు
ప్రశ్నిస్తారంటూ మండిపడ్డారు. ‘రాజధానిపై మాట మార్చి మూడు రాజధానులు అంటున్న
అబద్ధాలోడికి మేము సమాధానం చెప్పాలా? జగన్ ని ప్రశ్నించండి. మూడు రాజధానులు
అంటున్న వాడిని అడగకుండా ఒక రాజధాని అంటున్న మమ్మల్ని ప్రశ్నలు
అడుగుతారెందుకు?’ అంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపరులు
ప్రచారాలు చేస్తే తాము సమాధానం చెప్పాలా? అని ప్రశ్నించారు. తామేమైనా ఖాళీగా
ఉన్నామా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు ప్యాకేజి
తీసుకున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ని అదాని కి అమ్మేసిన వారిని మీరు
ప్రశ్నించాలన్నారు. విశాఖలో రైల్వే జోన్ తో సహా జరుగుతున్న పలు కార్యక్రమాలకు
అందరిని ఆహ్వానిస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కూడా
ఆహ్వానిస్తారా అంటే సమాధానం చెప్పలేదు.