న్యూఢిల్లీ : మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం
తెలిసిందే. ఈ నేపథ్యంలో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు,
ఆయన కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారానికి దూరంగా ఉండడం వంటి అంశాలపై
కాంగ్రెస్ అధిష్ఠానం అసంతృప్తితో ఉంది. పైగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి
ఓటేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరడం, దీనికి
సంబంధించిన ఆడియో లీక్ కావడం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది.
దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం
రమేశ్ స్పందించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.
నోటీసులకు కోమటిరెడ్డి వివరణ ఇస్తే, ఏఐసీసీ పరిశీలిస్తుందని తెలిపారు. ఒకవేళ
నోటీసులకు స్పందించకపోతే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కోమటిరెడ్డికి
ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చామని తెలిపారు. అక్టోబరు 22న, నవంబరు 4న
నోటీసులు ఇచ్చినట్టు వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఏమీ రైల్వే ప్లాట్ ఫాం
కాదని, కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ ముఖ్యమని, హద్దులు దాటితే చర్యలు
తప్పవని జైరాం రమేశ్ హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంపైనా జైరాం రమేశ్
స్పందించారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి
రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం సంతోషం కలిగించిందని తెలిపారు. ఇలాంటి ఉప ఎన్నికలు
కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని పేర్కొన్నారు.
ఇద్దరు కోటీశ్వరుల మధ్య కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గొప్ప పోరాటపటిమ
కనబర్చిందని కొనియాడారు. మునుగోడులో గెలిచింది మద్యం, డబ్బు మాత్రమేనని,
కాంగ్రెస్ ఓడిపోలేదని వ్యాఖ్యానించారు.