టిడిపి నేతలు జేబులు నింపుకోడానికి అప్పులు చేశారు
అప్పులు, పరిశ్రమలపై సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి యనమల వ్యాఖ్యలు అర్థరహితం
పవన్ పై హత్యాయత్నం చేసే అవసరం మాకేంటి?
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాధికారంలోకి వచ్చిన ఈ మూడున్నర సంవత్సరాల్లో చేసిన
అప్పులు వాటిని ఖర్చు చేసిన విధానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర
పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. శనివారం స్థానిక
సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర
విభజన సమయం నాటికి ఆంధ్రప్రదేశ్ కు 1,20,000 కోట్ల రూపాయల అప్పు ఉండేదని,
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 2019 నాటికి 2,80,000 కోట్ల
రూపాయలకు అప్పుల భారాన్ని పెంచారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి
వచ్చిన మూడున్నర సంవత్సరాలలో 1,10,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆయన
పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఒకపక్క కరోనా పరిస్థితిలను తట్టుకొని, మరొకపక్క ఆర్థిక మాంద్యం వలన
ఎదురవుతున్న పరిస్థితులను కూడా ఎదుర్కొంటూనే చేసిన అప్పులతో పేద ప్రజలను
ఆదుకుంటున్నామని, అదే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పులతో ఆ పార్టీ నాయకుల
జేబులు నింపుకున్నారని ఈ లెక్కలేవి తెలియని సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి యనమల
రామకృష్ణుడు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయటం హాస్యాస్పదంగా ఉందని అమర్నాథ్
వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో సుమారు పది సంవత్సరాలు పాటు ఆర్థిక
మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు ఒక్క రూపాయినైనా సద్వినియోగం చేశారా? అని
ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా, రైతుల రుణాలను మాఫీ
చేస్తామని చెప్పి మాట తప్పిందని, చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు గాలికి వదిలేసి,
ఇచ్చిన హామీలను తూ.చా తప్పకుండా అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై
విమర్శలు చేయడానికి యనమలకు నోరు ఎలా వచ్చిందని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో ఒక్క రూపాయి
అయినా అవినీతి జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు నిరూపించగలరా? దీనిపై కూడా
తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని అని అమర్నాథ్ సవాల్ విసిరారు.
తన నియోజకవర్గాన్ని వదిలి హైదరాబాదులో నివసిస్తున్న యనమల రామకృష్ణుడుకు
రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఎలా తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన
పాపాలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల
రామకృష్ణుడుకి సింగపూర్ లో పంటి వైద్యం చేయించుకోవడానికి 2 లక్షల రూపాయల
ప్రభుత్వ నిధులు వాడుకోలేదా? ఇలాంటి దుబారాలే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో
అనేకం జరిగాయని అమర్నాథ్ అన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో తెలిసి తెలియకుండా
మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యనమల చేస్తున్న ప్రయత్నాలు
ఇప్పటికైనా విరమించుకోవాలని అమర్నాథ్ హితవు పలికారు. రాష్ట్రానికి కానీ,
భావితరాల కోసం కానీ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు చేసింది ఏముందో
చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల
మనసులు గెలుచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు చేయడం
మానుకోవాలని అమర్నాథ్ హితవు పలికారు.
రాష్ట్రానికి పరిశ్రమ రావటం లేదని యనమల ఆరోపించటం హాస్యాస్పదంగా ఉందని,
విశాఖకు కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్కును కేటాయిస్తే, అది వద్దంటూ
కేంద్రానికి లేఖ రాసింది ఆయనే కదా? ఇలాంటి వ్యక్తికి రాష్ట్రంలో పరిశ్రమల
గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అమర్నాథ్ అన్నారు. ఒకపక్క వస్తున్న
పరిశ్రమలను అడ్డుకుంటూనే, ఒకపక్క రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని యనమల
ముఖ్యమంత్రి కి లేఖ రాయడాన్ని బట్టి చూస్తే ఆయనకు చంద్రబాబులాగే అల్జీమర్స్
వచ్చిందన్న అనుమానం కలుగుతోందని అమర్నాథ్ అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో
ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిస్తే, దానిపై కూడా విమర్శలు చేయడం యనమల
దిగజారుడుతనానికి అద్దం పడుతోందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. పార్ట్నర్షిప్
సమ్మిట్ల పేరుతో అనామకులకు సూటు, బూట్లు వేసి లక్షల కోట్ల పెట్టుబడులు
వచ్చాయని డబ్బా కొట్టిన ఘనత చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన
అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమల రంగంలో వస్తున్న వాస్తవ
పెట్టుబడులను మాత్రమే వెల్లడిస్తోంది అని అమర్నాథ్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉందని మహేంద్ర సత్యం అధినేత
కితాబు ఇచ్చిన విషయం నిర్మల తెలుసుకోవాలని ఆయన సూచించారు. వివిధ రంగాల్లో
ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును పక్కదారి పట్టించడానికి, విశాఖ రాజధాని
కాకుండా అడ్డుకోవడానికి చంద్రబాబు అతని అనుచర గణం కుట్రలు చేస్తూనే ఉందని ఆయన
అన్నారు.
ఇది ఇలా ఉండగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పై హత్యాయత్నానికి సుపారీ ఇచ్చారా
అన్న ఆరోపణలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అమర్నాథ్ సమాధానం చెబుతూ, ఆయనపై
హత్యాయత్నం చేయాల్సిన అవసరం మాకేంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి
అయ్యన్నపాత్రుడు అరెస్టు అంశాన్ని విలేకరులు లేవనెత్తగా తప్పు చేసిన వారిని
చట్టం ఏ విధంగా వదిలిపెడుతుందని ప్రశ్నించారు. తప్పు చేసిన అయ్యన్న అరెస్టు
చేస్తే, బీసీలందరినీ కించపరుస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రచారం చేయడం
విడ్డూరంగా ఉందని అమర్నాథ్ అన్నారు.