నల్గొండ : మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ రికార్డుస్థాయిలో నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తొలుత 92 శాతం నమోదైందని ప్రకటించారు. గురువారం రాత్రి పొద్దుపోయేంత వరకు సాగిన పోలింగ్‌ను అనుసరించి సవరించిన తుది అంచనాల ప్రకారం 93.13 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు శుక్రవారం చెప్పారు. 2018 ఎన్నికల్లో 91.3 శాతం పోలింగ్ నమోదవగా ప్రస్తుతం 1.8 శాతం పెరగడం విశేషం. ఓట్లు లెక్కించే నల్గొండలోని ఆర్జాలబావి గిడ్డంగుల సంస్థ వద్దకు చివరి ఈవీఎం అర్ధరాత్రి 1.30 గంటలకు చేరుకోగా స్ట్రాంగ్‌రూమ్‌కు శుక్రవారం తెల్లవారుజాము 4.40 గంటలకు సీల్ వేశామని అధికారులు వెల్లడించారు.
9 గంటలకు తొలి ఫలితం : ఆదివారం నిర్వహించే మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ప్రక్రియలో 21 టేబుళ్లు ఏర్పాటు చేయగా మొత్తం 298 పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను 15 రౌండ్లలో లెక్కించనున్నారు. ఉదయం 9 గంటలకల్లా తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు. తుది ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చే అవకాశముందన్నారు. తొలుత చౌటుప్పల్ మండలంలోని ఈవీఎంల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సంస్థాన్ నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల మండలాల ఈవీఎంలను టేబుళ్ల వద్దకు తరలిస్తారు. ఇప్పటికే ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బంది, అధికారులకు మూడు దఫాలుగా అధికారులు శిక్షణ ఇచ్చారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.