హైదెరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్ ముగియడంతో.. ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మునుగోడు మహాపోరులో మునిగేదెవరో? తేలేదెవరో? అన్న చర్చ కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం అత్యధికంగా అధికార టీఆర్ఎస్ కే అనుకూలమని చెప్పాయి. కానీ లెక్కింపు రోజు ఏం జరుగుతుందో, ఓటర్ల మనసులో ఏముందో, ఏజెన్సీల ఫలితాలు అన్నివేళలా నిజమవుతాయా? అన్న చర్చ జరుగుతోంది. గెలుపు కారుదంటే.. కాదు కమలానిదేనంటూ బెట్టింగులు సైతం జరుగుతున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక అనుభవాలను గుణపాఠాలుగా మలుచుకుని మునుగోడులో గులాబీ దళం ఏ అవకాశాన్ని వదులుకోకుండా పనిచేసింది. ప్రతి ఎంపీటీసీ పరిధిలో మంత్రి లేదా ఎమ్మెల్యేకు బాధ్యత అప్పగించారు. ఇక్కడ ఎమ్మెల్యేలు పెట్టిన ప్రతీ పైసా అధిష్ఠానం పంపడంతో ఉత్సాహంగా గులాబీ దళం పనిచేసింది. మరోవైపు ఎదుటి పార్టీలో ప్రజాప్రతినిధి లేకుండా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు.
తమ పరిధిలోని ఓటర్ల సమస్యలన్నింటినీ ఫోన్లలో, ఇతర మార్గాల్లో స్థానికంగా మకాం వేసిన నేతలు పూర్తిచేశారు. పోలింగ్‌కు ముందు మంత్రులు కేటీఆర్, హరీశ్, తలసాని రోడ్‌షోలు, మరోసారి ముఖ్యమంత్రి సభ ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు ముందు రోజు 90శాతం మంది ఓటర్లకు రూ.3వేలు చొప్పున నగదు కూడా పంపిణీ చేశారని చెబుతున్నారు. పోలింగ్‌కు ముందు రాత్రి పొద్దుపోయాక ప్రతి ఓటరుకు మరో రూ.1000 చొప్పున అందజేసినట్లు తెలుస్తోంది. కాగా, తమ ప్రచార వ్యూహం ఫలించిందన్న నమ్మకం ఉందని, 15 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.