సియోల్ : ఉభయకొరియాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఉత్తరకొరియా శనివారం సరిహద్దు ప్రాంతాల్లోకి 180 యుద్ధ విమానాలను తరలించింది. దక్షిణ కొరియా కూడా దీటుగా అత్యాధునిక ఎఫ్–35 ఫైటర్ జెట్లు సహా 80 మిలటరీ ఎయిర్ క్రాఫ్టులను మోహరించింది. ఉత్తర కొరియా బుధవారం రికార్డు స్థాయిలో 20కిపైగా క్షిపణులను ప్రయోగించడం, వాటిలో ఒకటి దక్షిణకొరియా సరిహద్దుల్లో పడటం తెలిసిందే. ప్రతిగా దక్షిణ కొరియా కూడా మూడు గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించింది. గురువారం కూడా ఉత్తరకొరియా ఆరు క్షిపణులు ప్రయోగించడంతో జపాన్ అప్రమత్తమైంది. అమెరికా, దక్షిణ కొరియా 240 యుద్ధ విమానాలతో చేస్తున్న సంయుక్త విన్యాసాలు శుక్రవారంతో ముగియాల్సి ఉంది. తాజా పరిణామాలతో వాటిని శనివారమూ కొనసాగించనున్నారు.
దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తరకొరియా ప్రకటించింది. ఈ తప్పిదానికి పశ్చాత్తాప పడతాయంటూ బెదిరించింది. కానీ, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించలేదు. అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొందడంతోపాటు ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికాపై ఒత్తిడి పెంచేందుకే ఉత్తరకొరియా ఇటువంటి తెగింపు చర్యలకు పాల్పడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.