ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు అధికమవుతునగనాయి. ఉత్తర కొరియాకు చెందిన 180 యుద్ధ విమానాలు శుక్రవారం ఇరు దేశాల సరిహద్దు గగనతలంలో ఎగిరాయి. మిలిటరీ డిమార్కేషన్ లైన్ (ఎండీఎల్)కి 20 కిలోమీటర్ల దూరంలోని వ్యూహాత్మక సరిహద్దు రేఖ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించాయి. వీటిని గుర్తించిన దక్షిణ కొరియా వెంటనే అప్రమత్తమైంది. 80 ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. అదేవిధంగా అమెరికా, దక్షిణ కొరియా కలిసి 240 యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించాయి. ప్యోంగ్యాంగ్ గగనతలంలో దాదాపు 180 ఉత్తర కొరియా యుద్ధ విమానాలను తమ మిలిటరీ గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు అమెరికాతో కలిసి జాయింట్ డ్రిల్స్‌లో పాల్గొన్న యుద్ధ విమానాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
అయితే అమెరికాతో కలిసి దక్షిణ కొరియా గురువారం నిర్వహించిన వాయు విన్యాసాలపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. గత రాత్రి సుమారు 80 రౌండ్ల ఆర్టిలరీని పేల్చింది. అలాగే పలు క్షిపణులను సముద్రంలోకి లాంచ్ చేసింది. అయితే అది ప్రయోగించిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి విఫలమయ్యాయి.