గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇసుదాన్ గఢ్వీ పేరును ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ. మాజీ యాంకర్ గా, జర్నలిస్టుగా గుజరాత్ రాష్ట్రంలో విశేషాదరణ పొందిన గడ్వీ నేతృత్వంలో ఆప్ ఎన్నికలకు వెళ్తుంది. 40 ఏళ్ల గడ్వీ.. గుజరాత్ లోని ద్వారక జిల్లా పిపాలియా గ్రామంలో ఉన్నత రైతు కుటుంబంలో జన్మించారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ మాస్టర్స్ చేసిన ఆయన.. దూరదర్శన్ లో ‘యోజన’ అనే కార్యక్రమంతో కెరీర్ మొదలు పెట్టారు. 2007 నుంచి 2011 వరకు ఈటీవీ గుజరాతీ ఛానల్లో ఆన్ ఫీల్డ్ జర్నలిస్టుగా పనిచేశారు. ఆ తర్వాత 2015లో గఢ్వీ.. వీటీవీ గుజరాతీ ఛానల్లో చేరి ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2021 వరకు అక్కడే పనిచేసిన ఆయన ప్రముఖ ప్రైమ్ టైమ్ టీవీ షో ‘మహామంథన్’ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. యాంకర్ గా, జర్నలిస్టుగా విశేష ప్రజాదరణ పొందిన గఢ్వీ ఏడాది క్రితమే న్యూస్ మీడియాను వీడి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2021 జూన్ లో అరవింద్ కేజ్రివాల్ అహ్మదాబాద్ లో ఆప్ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే వేదికపై గడ్వీ.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ తర్వాత పార్టీలో క్రమక్రమంగా ఎదిగారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం.. ప్రజల్లో ఉన్న పేరు కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా నియమించింది.