ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. . బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నందిగామ, జగ్గయ్యపేటల్లో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. రోడ్షోలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగాన్నిఏమాత్రం పట్టించుకోవడం లేదని, మోటార్లకు మీటర్లు పెట్టి అన్నదాతలను కష్టాల్లోకి నెడుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర భూములు తాకట్టు పెట్టి రూ.23 వేల కోట్ల అప్పు చేశారని, ఇలాంటి వాళ్లు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు, పరిశ్రమలు లేవని మండిపడ్డారు. అక్రమ కేసులు, దాడులతో రాజ్యమేలాలని వైసీపీ చూస్తోందని, కేసులు, దాడులకు టీడీపీ నేతలు భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు అన్నారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలంతా కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఈ సర్కార్ ఇచ్చేది గోరంత.. దోచుకునేది కొండంత అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఇళ్లపైకి పోలీసులు దాడులకు వస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించే పోలీసులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. విధ్వంసం, విభజన వైసీపీ సర్కార్ నైజమని, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు.