గతేడాది అనంతపురం జిల్లాకు 890 కోట్ల రూపాయలు పంటల బీమా మంజూరైంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇన్ పుట్ సబ్సిడీలు, పంటల బీమా ఎగ్గొట్టిన సంగతిని ప్రజలు మరిచిపోలేదు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతిని ప్రజలు మరిచిపోలేదు కాబట్టే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ని ఓడించి ఇంటికి పంపారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏమి జరుగుతోందో కనీసం తెలుసుకోకుండా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మొద్దునిద్ర పోయారు. ఈరోజు మేమున్నామంటూ ఉనికి కాపాడుకునేందుకు బాదుడే బాదుడు అంటూ పయ్యావుల కేశవ్ ఓ వైపు పాదయాత్ర చేస్తున్నారు, ఇంకోవైపు పంట నష్టం కోసం తెలుగుదేశం అంటూ పరిటాల సునీత పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలైనా చేసుకోండి.. మోకాళ్ల మీద యాత్రలైనా చేసుకోండి.. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మీతోకాని, మాతోకాని చెప్పించుకునే స్థాయిలో మా ముఖ్యమంత్రి లేరు. ఆయన రైతుల పక్షపాతి. రైతులకు ఏమి చేయాలో అన్నీ తెలుసు. పంట నష్టాల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. వారి హయాంలో ఎప్పుడూ రైతుల కష్టాలను గమనించలేదు. నష్టాల గురించి పట్టించుకోని వ్యక్తులు ఈరోజు పాదయాత్రలు చేసేందుకు బయలుదేరారని తోపుదుర్తి ఎద్దేవా చేశారు.