విజయవాడ : జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అవార్డు రావడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ కరీముల్లా షేక్ అమీన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణాధికారసంస్థ 12వ వార్షికోత్సవ దినం పురస్కరించుకుని న్యూఢిల్లీలో అక్టోబర్ 31న అవార్డును అందుకోవడంలో ఎంతో సంతోషంగా ఉన్నదని కరీముల్లా అన్నారు. గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణా సంస్థ నిబంధనలను అధిక శాతం మేర నిర్వహించి, మెరుగైన ఫలితాలు సాధించిన సంస్థలకు అవార్డులకు ఎంపిక చేశారన్నారు. లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ గిడ్డంగుల సంస్థ ఖాతాదారులకు, రైతులకు మెరుగైన సేవలు అందించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని కరీముల్లా షేక్ అమీన్ అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన వారిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఒకటన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం పట్ల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కంఠనాధరెడ్డి, అధికారులు, రైతులు, ఖాతాదారులు తమ అభినందనలను తెలియచేశారు.