విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పేరు మార్పునకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభలో ఇటీవల ప్రవేశపెట్టి ఆమోదించారు. దీనికి గవర్నర్ కూడా ఆమోదం తెలపడంతో… ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాస్త వై ఎస్ ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారిపోయింది. పేరు మార్పును తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఎంతగా వ్యతిరేకించినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో ముఖ్యమంత్రి జగన్ అనుకున్నది చేసి చూపించారు.
పేరు మార్పు బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు అధికారికంగా మారిపోయింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు స్థానంలో డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బోర్డును యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 20వ తేదీన యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు పాస్ చేసిన విషయం తెలిసిందే.