హైదరాబాద్ : దేశంలో 50 కోట్లకు పైగా గేమర్స్ ఉన్నారు. ఇందులో నాలుగో వంతు మంది అంటే 12 కోట్ల మంది పేయింగ్ యూజర్లు (డబ్బులు చెల్లించి ఆన్లైన్ గేమ్స్ ఆడే వారు) ఉన్నారని ప్రీమియర్ గేమింగ్, ఇంటరాక్టివ్ మీడియా వెంచర్ క్యాపిటల్ ఫండ్ లుమికాయ్ వెల్లడించింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియా గేమ్ డెవలపర్స్ సదస్సులో ‘స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ ఎఫ్వై 2022’ నివేదికను విడుదల చేసింది. 2021-22లో 1,500 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయి. మొబైల్ ద్వారా గేమ్స్ ఆడుతున్న వారు అత్యధికంగా దేశంలోనే ఉన్నారని పేర్కొంది. భారత్ ఆధారిత కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోందని వెల్లడించింది. అంతేకాకుండా దేశయ గేమింగ్ మార్కెట్ ఏడాదికి 27 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని పేర్కొంది. 2021-22లో 260 కోట్ల డాలర్లు ఉన్న మార్కెట్ 2026-27 నాటికి 860 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన గేమ్ డౌన్‌లోడ్స్‌లో 17 శాతం భారత్‌లోనే ఉన్నాయని లుమికాయ్ తెలిపింది.