అమరావతి : నూతన పరిశోధనలతోనే దేశం పురోగతి సాధిస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఇస్రో, కేంద్ర అణు ఇంధన శాఖల సహకారంతో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏర్పాటు చేసిన శాస్త్ర సాంకేతిక ప్రదర్శనను గురువారం గవర్నర్ ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా అభివృద్ధి పథంలో పయనించే ఏ దేశమైనా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందడుగు వేసినవేనని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు. సంపద సృష్టి, మానవ వనరుల అభివృద్ధి, దేశ, ఆర్థిక వ్యవస్థ వంటివన్నీ పరిశోధనలతో ముడిపడి ఉంటాయన్నారు.
విద్యాసంస్థల్లో పనిచేసే విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు సమాజానికి ఉపకరించే నూతన పరిశోధనల దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ చెప్పినట్లు సైన్స్ కి దేశాలతో సంబంధం లేదనీ, ఎందుకంటే జ్ఞానం మానవాళికి చెందినదే కాకుండా ప్రపంచాన్ని ప్రకాశింపజేసే జ్యోతి అని గవర్నర్ హరిచందన్ స్పష్టం చేసారు. కృషి, పట్టుదలతో నూతన ఆవిష్కరణలకు కృషి చేసే శాస్త్రవేత్తలకు భారత్ నిలయమన్నారు. కేంద్రం అత్మనిర్భన్ భారత్ ద్వారా స్వయం సమృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని గవర్నర్ పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అధ్యక్షడు, ప్రో ఛాన్సలర్ డాక్టర్ పి.సత్యనారాయణన్ మాట్లాడుతూ, కేవలం ఐదేళ్ల కిందట స్థాపించిన ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 88వ వార్షిక సమావేశాలకు వేదిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
తొలి నుంచీ బోధన , పరిశోధనలకు పెద్దపీట వేసే ప్రణాళికలతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. సాంకేతిక రంగంలో అనూహ్య పురోగతి సాధిస్తున్న భారత్ రానున్న సంవత్సరాలలో అగ్రరాజ్యాలకు ధీటుగా ఎదుగుతుందన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ మనోజ్ కే ఆరోరా విశ్వవిద్యాలయ ప్రగతిని వివరించారు. ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య డి నారాయణరావు మాట్లాడుతూ. స్పేస్, మెడికల్, కమ్యూనికేషన్ రంగాల్లో ఎంతో పురోగతి సాధించిన భారత్ కోవిడ్ విపత్తు సమయంలో పరిశోధనా సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుని నేడు వ్యాక్సిన్స్ తయారీ ఫ్యాక్టరీగా మారిందన్నారు. పరిశోధనల పురోగతి కారణంగా భారత్ జీడీపీ రేటు 7 శాతానికి చేరిందన్నారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రెసిడెంట్ డాక్టర్ యూవీ వాగ్మారే కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా, ఏపీ కళాశాల ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాలరెడ్డి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ కుమార్, ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ గోపీకృష్ట తదితరులు పాల్గొన్నారు.