అమరావతి : ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన నాణ్యమైన, ఆరోగ్య కరమైన సహసిద్ద వ్యవసాయ ఉత్పతులను వినియోగ దారులకు తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చేందుకు మార్కప్ బ్రాండ్ తో ఏ.పి. మార్కుఫెడ్ రూపొందించిన ఐదు రకాల ఉత్పత్తులను రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి గురువారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్దతులపై పనిచేసే రైతు సాధికారత సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగ దారులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన సహసిద్ద వ్యవసాయ ఉత్పత్తులను అతి తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మార్కప్ బ్రాండ్ తో ప్రకృతి సిద్ద వ్యవసాయ ఉత్పత్తులను బహిరంగ మార్కెట్ లోకి ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. తొలుత బెల్లం, వేరుశనగ పప్పు, జొన్నపిండి, రాగి పిండి, శెనగపప్పు తదితర ఐదు ప్రకృతి సిద్ద ఉత్పత్తులను ఈ బ్రాండ్ పేరుతో నేడు బహిరంగ మార్కెట్ లోకి ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. దశల వారీ మిగిలిన అన్నిప్రకృతి సిద్ద వ్యవసాయ ఉత్పత్తులను మార్కప్ బ్రాండ్ తో వినియోగ దారులకు అందుబాటులోకి తీసురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విధాలుగా మేలు చేయాలనే లక్ష్యం, చిత్తశుద్దితో కృషిచేస్తున్నారన్నారు. రైతులు పండించే పప్పుదినులు, చిరుధాన్యాల రేట్లు బహిరంగ మార్కెలో ఏమాత్రం పడిపోయినా సరే కేంద్ర ప్రభుత్వంతో సంబందం లేకుండా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వారి ఆదేశాల మేరకు ఏపి మార్కుఫెడ్ సేకరించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కప్ బ్రాండ్ తో బహిరంగ మార్కెట్ లోకి తీసుకు వచ్చి రైతులను అన్ని విదాలుగా ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టం జరిగిందన్నారు. ప్రకృతి సిద్దంగా పండించే వ్యవసాయ ఉత్పత్తులకు 10శాతం అదనంగా గిట్టుబాటు ధర లభించే పరిస్థితి ఏర్పడిందన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రయోగాత్మకంగా ప్రసాదాల కోసం వినియోగించడం జరుగుచున్నదన్నారు. రసాయనరహితమైన ఆరోగ్య కరమైన పరిశుభ్రమైన భోజనాలు అందించాలనే లక్ష్యంతో ఒక వింగ్ ఏర్పడిందని, రైతు సాధికార సంస్థ ద్వారా రైతుల వివరాలు, వారి ఉత్పత్తుల వివరాలను సేకరించి రాష్ట్రంలోని మిగిలిన దేవాలయాలకు అన్నింటికీ కూడా ప్రకృతి సిద్ద వ్యవసాయ ఉత్పత్తులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. పిల్లలు, గర్బవతులు, బాలింతలకు కూడా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో ఆయా సంస్థలకు కూడా ఈ ఉత్పత్తులను అందజేయడం జరుగుచున్నదన్నారు.
ఏ.పి. మార్కుఫెడ్ చైర్మన్ పి.పి.నాగి రెడ్డి, ఏపి సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్ పెర్సన్ పి.సుస్మితా రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డా.శేఖర్ బాబు, జనరల్ మేనేజర్ బి.ఆదినారాయణ, మార్కప్ బ్రాండ్ హెడ్ ఎ.శ్రీధర్ తదితరులు ఈ ఉత్పత్తుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.