ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
హైదరాబాద్, అభి మీడియా బ్యూరో ప్రతినిధి : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు. జూన్ 2 వ తేదిన సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు రెండు గంటల పాటు ట్యాంక్ బండ్ వద్ద అవతరణ వేడుకలను ఉత్సవం లా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. పోలీసు బ్యాండ్‌తో కార్నివాల్, జయజయహే తెలంగాణ అనే రాష్ట్ర గీతంతో కూడిన ఫ్లాగ్‌వాక్, రాష్ట్రంలోని సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని తెలిపే వివిధ జానపద మరియు గిరిజన కళారూపాలు ప్రదర్శనలు మొదలుకుని బాణాసంచాలు కాల్చి కార్యక్రమానికి ముగింపు పలికే వరకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సందర్శకుల కోసం ఫుడ్ కోర్ట్ లు, షాపింగ్ స్టాల్స్, గేమింగ్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే వారికి ఇబ్బందులు కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం సజావుగా, ప్రభావవంతంగా జరిగేలా ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించి అధికారులు అందరు సమన్వయంతో పని చేయాలని సీఎస్ ఆదేశించారు. పార్కింగ్, బందోబస్తుకు తగిన ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు దానకిషోర్, శ్రీనివాస్‌రాజు, పొలిటికల్ సెక్రటరీ రఘునందన్‌రావు, టీఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ అమ్రపాలి, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.