డీజీపీకి సిట్ నివేదిక అందజేత
150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందించిన సిట్
ఏపీలో పోలింగ్ రోజున, ఆ తర్వాత హింసాత్మక ఘటనల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు
తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన ఘటనలపై సిట్ దర్యాప్తు
అమరావతి, ప్రధాన ప్రతినిధి : పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు జరిపింది. ఈ మేరకు 150 పేజీలతో ప్రాథమిక నివేదిక రూపొందించిన సిట్ ఆ నివేదికను నేడు ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు సమర్పించింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ నేడు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను కలిసి నివేదికను అందించారు. పోలింగ్ నేపథ్యంలో పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 33 ఘటనలు జరిగినట్టు సిట్ గుర్తించింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్ ను పరిశీలించింది. స్థానికులు, పోలీసులను కూడా సిట్ సభ్యులు విచారించారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది. ఈ నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి అందజేశారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు గుర్తించారు. ఈ దమనకాండపై రెండు రోజులపాటు విచారణ జరిన సిట్ అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి విచారణ జరిపింది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలకాంశాలను పొందుపరిచింది. మూడు జిల్లాల్లో దాదాపు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు తేల్చింది. పల్నాడు జిల్లాలోని 3 అసెంబ్లీ స్థానాల్లో 22 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు, తిరుపతి జిల్లాలోని 2 అసెంబ్లీ స్థానాల్లో 4 కేసులు నమోదైనట్లు సిట్ వెల్లడించింది. క్షేత్రస్థాయిలో పోలీసులు, బాధితులు, ఇతర వర్గాల నుంచి సాక్ష్యాలు సేకరించి నివేదిక రూపొందించినట్లు పేర్కొంది. 33 కేసుల్లో ఎఫ్ఐఆర్ ప్రకారం 1,370 మంది నిందితులుగా ఉన్నారని, ఇప్పటి వరకు 124 మంది అరెస్టయ్యారని తెలిపింది. మిగతావారిని కూడా అరెస్ట్ చేయాలని సూచించింది. రెండు వర్గాల ఘర్షణలు మరణాలకు కారణమై ఉండేవని తేల్చింది. కేసుల దర్యాప్తులోనూ తీవ్ర లోపాలు గుర్తించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. మరోవైపు నమోదైన ఎఫ్ఐఆర్లో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపైనా సిట్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా? వద్దా అనే అంశంపైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హింస జరుగుతుందని తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా సిట్ నిర్థరించింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింస జరుగుతున్నా మిన్నకుండిపోయారని ఈ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో కొందరు పోలీస్ అధికారులపైనా కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఈ ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు వంటి సామగ్రికి సంబంధించిన ఆధారాలూ సేకరించిన సిట్ ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలపైనా కొన్ని సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను డీజీపీ.. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ప్రభుత్వం ద్వారా అందించనున్నారు. ఈ ఘటనలపై పూర్తి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సిట్ కోరే అవకాశం ఉంది.