విజయవాడ బ్యూరో ప్రతినిధి : భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించబడిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కేవలం ఏడు రోజుల్లో 6, 305 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి దర్శించి ప్రపంచ రికార్డు సృష్టించిన విజయవాడకు చెందిన షేక్ నయీమ్ పాషా, మోటపోతుల ఉదయ్ నాగభూషణం అభినందనీయులనీ శ్రీ గౌతమ్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఎన్ సూర్యారావు ప్రశంసించారు. గురువారం చిట్టినగర్ లోని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నయీమ్ పాషా , ఉదయ్ లను శాలువలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ భారతదేశంలోని చారిత్రక వారసత ప్రదేశాలను చూడడంలో ప్రపంచరికార్డును నెలకొల్పిన ఈ ఇరువురి కృషి యువతకు ఆదర్శప్రాయం అని కొనియాడారు . బిజెపి రాష్ట్ర నాయకులు బి.శివకుమార్ పట్నాయక్ మాట్లాడుతూ భారతీయ చారిత్రక ప్రదేశాల విశిష్టతను గుర్తించి అత్యంత వేగంగా ఆయా ప్రాంతాలను సందర్శించిన మొదటి భారతీయాత్రికులుగా గుర్తింపు పొందడం అభినందనీయమని అన్నారు. గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ భారతీయ చారిత్రక కట్టడాల విశిష్టతను ఈ యువకులు గుర్తించి ఆయా ప్రాంతాలను రైలులో సందర్శించి ఇలా రికార్డు నెలకొల్పడం అభినందనీయమని వారిని అభినందించారు.చారిత్రక ప్రదేశాలను సందర్శించిన యువకులు నయీమ్ పాషా,ఉదయ్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించిన యునిస్కో యొక్క భారతదేశ ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించాలన్న ఆకాంక్షతో తాము ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు నుండి రైలులో తమ ప్రయాణాన్ని ప్రారంభించామని 7 రోజుల్లో మొత్తం 6305 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఆయా ప్రదేశాలను సందర్శించిన అనంతరం విజయవాడలో తమ యాత్రను ముగించామని చెప్పారు. ఇది ఒక సరికొత్త ప్రపంచ రికార్డుగా వారు చెప్పారు. భారతీయ కరెన్సీ 50 రూపాయల నోటు పై ముద్రించిన హంపిలోని రాతిరథం, 500 రూపాయలు నోటు మీద ఉన్న న్యూఢిల్లీలోని ఎర్రకోట, 100 రూపాయల నోటు మీద ఉన్న పటాన్ లోని రాణి కి వావ్, 20 రూపాయల నోటు మీద ఉన్న ఔరంగాబాద్ లోని ఎల్లోరా గుహలు ,200 రూపాయల నోటు మీద ఉన్న భోపాల్ లోని సాంచి స్తూపం, 10రూపాయల నోటు మీద ఉన్న కోణార్క్ లోని సన్ టెంపుల్ వంటి చారిత్రక ప్రదేశాలను తాము సందర్శించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు అత్తులూరి పెద్దబాబు, బిజెపి నాయకులు అవ్వారు బుల్లబ్బాయి తదితరులు పాల్గొని యువ యాత్రికులను అభినందించారు.