మేడే చరిత్ర–ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు పుస్తకావిష్కరణ సభలో డివివిఎస్ వర్మ
విజయవాడ, ప్రధాన ప్రతినిధి : కార్మిక సంఘాల కార్యక్రమాలు దీర్ఘకాలిక ప్రయోజనాలతో ఒక ప్రణాళిక అబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. మేడే పోరాట కాలంలో అమెరికాలో కార్మిక వర్గం తన పోరాట వ్యూహాన్ని నిర్మించుకోవడానికి అనుసరించిన పద్ధతి అది. ఆ పద్ధతి శాస్త్రీయమైందని ఆ ఉద్యమం నిరూపించింది. అని దారి దీపం పత్రిక సంపాదకులు డివివిఎస్ వర్మ అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగిన మేడే చరిత్ర–ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు పుస్తకాన్ని ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు అధ్యక్షత వహించారు.
మేడే అంటే ఉత్సవం కాదని, పండుగ కాదని, అది ఒక ఉద్యమమని, హక్కుల సాధన కోసం జరిగిన పోరాటమని ఆయన గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో నేడు కార్మిక వర్గం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం అణచి వేస్తున్నప్పటికీ కార్మిక వర్గంలో తగినంత ప్రతిస్పందన కనిపించలేదని ఆయన అన్నారు. చికాగోలో మేడే ఉద్యమానికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పనలో రెండు సంవత్సరాల కాల పరిధిని నిర్ణయించుకున్నారన్నారు. అత్యంత నిర్మాణాత్మకంగా ఉద్యమాన్ని విజయవంతం చేసిన విషయాన్ని నేటి ట్రేడ్ యూనియన్ నాయకులు గుర్తించి ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. మేడే సందర్భంగా చేసే ప్రసంగాలలో తీసుకునే నిర్ణయాలలో తాత్కాలిక ప్రయోజనాలతో కూడిన అంశాల ఎజెండాను ప్రతిపాదించటం సరికాదన్నారు. జాతీయ స్థాయి లక్ష్యాలతో కూడిన కార్మిక వర్గ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు.
ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన విశాలాంధ్ర సంపాదకులు ఆర్ వి రామారావు మాట్లాడుతూ భారతదేశంలోని కార్మిక సంఘాలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇతర సంస్థలపై దృష్టి కేంద్రీకరించాయి. కానీ దేశంలో అసంఖ్యాకంగా ఉన్న అసంఘటిత తరంగాన్ని సమీకరించడంలో, సంఘటిత పరచడంలో విఫలమయ్యాయన్నారు. అందువల్లనే అసంఘటిత రంగం ఎవరికీ కాకుండా పోయిందన్నారు ఏడాదికో రెండేళ్లకు దేశ పారిశ్రామిక సమ్మెకు పిలుపు ఇవ్వడం తప్ప ఆ రంగాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు, అయినప్పటికీ అసంఘటిత రంగం సమ్మెల ద్వారా తమ అస్థిత్వాన్ని నిరూపించుకుంటూ వచ్చాయని చెప్పారు. ఇక ప్రస్తుతానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెక్టార్‌గా భావిస్తున్న ఐటీ రంగాన్ని కార్మిక సంఘాలు తమ వైపు తిప్పుకోవడంలో, సంఘాలు పెట్టడంలో విఫలమయ్యాయన్నారు. అవి పుబ్బలో పుట్టి మఖలో అంతరించినట్టుగా అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి, యువజన రంగాలలో కొత్త తరం రాకపోవడం వల్ల కార్మిక సంఘాలకు కూడా నష్టం జరిగిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటువంటి సంక్షోభ సమయంలో ఈ తరహా పుస్తకాలు రావాల్సిన అవశ్యకత ఉందని, అయితే అవి కేవలం మొక్కుబడి తరహా కాకుండా కార్మిక వర్గ చైతన్యాన్ని, అటు మేధోపరంగా ఇటు ఆచరణాత్మకంగా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆర్వీ రామారావు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశానికి హాజరైన మరో ముఖ్యవక్త ఐఎఫ్టియు ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక సంఘాలు కొత్త తరహా ఉద్యమాలను నిర్మించేందుకు ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు మున్ముందు ఎలా ఉన్నప్పటికీ ఒక విశాల ప్రాతిపదికన కార్మిక సంఘాలు ఏకీకృత పోరాటాలకు ముందుండాలని, ఆ దిశగా కార్మిక సంఘాల నాయకులు కార్యాచరణకు ఉపక్రమించాలని కోరారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ పుస్తకం కార్మిక వర్గానికి మేలు చేస్తుందని ఆయన చెప్పారు.
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మిక సంఘాలు పాతకాలపు ధోరణి మార్చుకోవటంతో పాటు క్రియాశీల ఐక్య కార్యాచరణకు శ్రీకారం చుట్టాలన్నారు. ఏ రంగాలలో కార్మిక సంఘాలకు అవకాశం లేకుండా పోయిందో వాటిపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో లేబర్ కోడ్స్ పేరిట వచ్చిన నాలుగు చట్టాలు కార్మికుల హక్కులను హరించేవిగా ఉన్నాయన్నారు. ఎనిమిది గంటల పని దినం కోసం ఆవేళ కార్మికులు పోరాడితే, ఈవేళ ఎనిమిది గంటల పని స్థానంలో 12 గంటల పని దినం వచ్చిందని, డబ్బులు వస్తున్నాయన్న ఆశతో కార్మిక వర్గం కూడా రాజీ పడుతుందని అభిప్రాయపడ్డారు. కార్మిక వర్గం ఏమి కోల్పోతుందో తెలియజేసి వాళ్ళందర్నీ ఏకతాటిపై నిలిపేందుకు ఈ మేడే ఉపయోగపడాలని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ పుస్తకం కార్మిక వర్గ చరిత్రను మేడే చరిత్రను తెలియజేయటానికి ఉపయోగపడుతుందన్నారు.
ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడుతూ కార్మిక వర్గానికి గత కాలపు పోరాటాలు ఏమిటో తెలియకపోతే భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం కష్టమవుతుందన్నారు. ఈ పుస్తకం ప్రచురించేందుకు వచ్చిన అవకాశం వినియోగించుకుని కాస్త ఆలస్యం అయినా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ మేడే అంటే చాలామందికి ఒక ఉత్సవంలో పండగని తెలుసని, ఎనిమిది గంటల పని దినం కోసం కార్మిక వర్గం వెతలు చెందాల్సి వచ్చిందో ఈ పుస్తకం వివరిస్తున్నారు. పుస్తకాన్ని సమీక్షించిన రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శి కొమ్మాలపాటి శరచ్చంద్ర జ్యోతిశ్రీ మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని తీసుకురావడం వెనుక చేసిన కసరత్తును వివరించారు. రాబోయే కాలంలో కార్మిక వర్గ భవిష్యత్ కార్యాచరణకు ఇటువంటి పుస్తకాలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. పుస్తక సంపాదకులు ఆకుల అమరయ్య తాను పుస్తకం తీసుకొచ్చిన నేపథ్యాన్ని వివరించారు. ఈ వ్యాస సంకలనం తీసుకురావడంలో సహకరించిన పీకాక్ క్లాసిక్ సంపాదకుడు అన్నవరపు గాంధీకి ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఓబులేసు ఇతర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘం నాయకులు భద్రం తన సందేశమిస్తూ ర^è యితలు చిత్తశుద్ధితో ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారని అభినందించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమానికి శీలం వెంకటసుబ్బయ్య వందన సమర్పణ చేశారు.