విజయవాడ పశ్చిమ బ్యూరో ప్రతినిధి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా విజయవాడ భవానిపురం ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియామకపు ఆదేశాలు జారీ చేశారు. ఆకుల శ్రీనివాస్ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి ఆయన ముఖ్య అనుయాయుల్లో ఒకరిగా నిలిచారు.గతంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో అనేక ఉద్యమాల్లో ఆకుల శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆకుల శ్రీనివాస్ అనేక ఉద్యమాలు నిర్వహించారు. కాగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగనన్న ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకు వెళుతున్నట్లు చెప్పారు. అలాగే రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీ 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. తన మీద నమ్మకం ఉంచి తన నియామకానికి కృషిచేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ,ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి లకు ఆకుల శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు.