4 అంశాలను లేఖలో ప్రస్తావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వెలగపూడి బ్యూరో ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా మాట్లాడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు సోమవారం వెలగపూడి సచివాలయం నందు సీఈవో ముఖేష్ కుమార్ మీనాను కలిసి ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలనేవి హుందాగా ఉండాలని మల్లాది విష్ణు అన్నారు. అంతేగానీ ఎదుటి వారిని కించపరిచేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈనెల 21న నర్సాపురం, భీమవరం సభలలో జనసేన అధినేత మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరమని మల్లాది విష్ణు అన్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఒళ్లు దగ్గర పెట్టుకోమని, నాలుక కత్తిరిస్తామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారన్నారు. లక్షలాది పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్.. ఈరకంగా అసభ్యకరంగా మాట్లాడటాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఒక అజెండా, సిద్ధాంతాలు లేని వ్యక్తులే ఇటువంటి దిగజారుడు విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థాయిని తెలుసుకుని పవన్ మాట్లాడాలని.. పవిత్రమైన వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్న జనసేన అధినేత కూడా ముఖ్యమంత్రిని విమర్శించడం బాధాకరమన్నారు. తక్షణమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భీమవరం సభలో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ను బెదరించేలా పవన్ మాట్లాడటాన్ని మల్లాది విష్ణు తప్పుబట్టారు. అలాగే నర్సాపురం సభలో సజ్జల రామకృష్ణారెడ్డి గూర్చి పవన్ మాట్లాడిన అభ్యంతర వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు.
ప్రతిపక్షాలకు ఎన్నికల నియమావళి పట్టదా..?
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎన్నికల నియమావళిని ఎన్నిసార్లు ఉల్లంఘిస్తాయని మల్లాది విష్ణు మండిపడ్డారు. వివేకానందరెడ్డి హత్య కేసు గూర్చి మాట్లాడవద్దని కోర్టు చెబుతున్నా.. వైఎస్ షర్మిల మాత్రం పదేపదే ప్రస్తావిస్తున్నారన్నారు. ఈ అంశాన్ని మరోసారి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. అలాగే జాబ్ లు, కొండలు, రోడ్లు ఉండవని ప్రజలను తప్పుదోవ పట్టించేలా తెలుగుదేశం సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్న పాటపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదును అందించడం జరిగిందన్నారు. ఈ పాటను పోస్టు చేసిన వారితో పాటు రాసిన వారు, కంపోజ్ చేసిన వారు, పాడిన వారిపైనా క్రిమినల్ కేసులను నమోదు చేయవలసిందిగా కోరినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలలోని పోలింగ్ స్టేషన్ ల వద్ద శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని ఈసీని కోరినట్లు మల్లాది విష్ణు చెప్పారు. ముఖ్యమంత్రి సభకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తుండటం, విజయవాడ రాయి దాడి ఘటన నేపథ్యంలో.. సీఎం జగన్ భద్రత పట్ల పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైందని, దానిని కూడా తెలుగుదేశం తప్పబట్టడం సరికాదన్నారు. ఎస్పీ స్థాయి అధికారులు ఉండేలా చర్యలు చేపడుతుంటే.. కనీస భద్రత లేకుండా చేయాలని తెలుగుదేశం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. అధికారులను బెదరించే ధోరణిని మానుకోవాలని తెలుగుదేశం నేతలకు సూచించారు. ఎన్ని కూటములు ఏకమైన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట నాయకులు రావెల కిషోర్ బాబు, అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.