మంత్రి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెనాలి బాష కుటుంబం
‘నవరత్నాల్లా’ ఎదురొచ్చి మంత్రి బుగ్గనకు హారతులిచ్చిన 9మంది మహిళలు
చేసిన అభివృద్ధికి అడుగడుగునా ఆత్మీయ సత్కారం
మళ్లీ గెలిచేది మీరేనంటూ మనసారా హిజ్రాల ఆశీర్వాదం
విస్తృతంగా పర్యటించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
నంద్యాల జిల్లా బ్యూరో ప్రతినిధి : ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బేతంచెర్ల పట్టణ ప్రజలతో మమేకమయ్యారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రచారంతో పండగ వాతావరణంలా మారింది. బేతంచెర్ల అభివృద్ధి కోసం పాటుపడిన మంత్రి బుగ్గన తమ ఇళ్లకు రావడంతో మహిళలు హారతులు ఇచ్చారు. నుదుటన వీర తిలకం దిద్ది దిష్టి తీశారు. అవ్వ, తాతలు మనసారా ఆశీర్వదించారు.మంత్రి బుగ్గన తన క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి బేతంచెర్ల పట్టణంలోని కొత్తపేట,శ్రీనగర్ కాలనీ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వాటర్ ట్యాంక్ కాలనీ, సత్రం మీదుగా వెల్దుర్తికి వెళ్లే బయటి పేట, నాగులకట్ట,జెండా పేట, గౌరీ పేటలో పర్యటించారు. కొత్తపేట వీధికి వెళ్లే దారిలో ఆ ప్రాంత ప్రజలు క్రేన్ ద్వారా తీసుకువచ్చిన భారీ గజమాలతో మంత్రి బుగ్గనను సత్కరించారు. అనంతరం శ్రీనగర్ కాలనీలో ప్రభుత్వం పేద ప్రజలకు అమలు చేసిన నవరత్నాల పథకాల నేపథ్యంతో తొమ్మిది మంది మహిళలు మంత్రి వద్దకు వచ్చి విజయం బుగ్గనదేనంటూ హారతి పట్టారు. శ్రీనగర్ కాలనీ లో ఓ అవ్వ..మంత్రిని మనసారా అభినందించారు. అక్కడే తెనాలి బాష ఇంటికి వెళ్లారు. మంత్రి బుగ్గన సమక్షంలో ఆయన కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని బేతంచెర్ల ప్రజలకు అందించారంటూ వారు మంత్రిని ప్రశంసించారు. మంత్రి బుగ్గన ప్రచారం చేయక పోయినా ఆయన చేసిన అభివృద్ధి ప్రచారం చేస్తుందని స్థానిక ప్రజలు మంత్రి సేవలను కొనియాడారు. వృద్ధులు, ముస్లిం మైనారిటీ కుటుంబాలు మంత్రి బుగ్గనను ఆత్మీయ ఆలింగనం, అభివాదాలతో ముంచెత్తారు. అనంతరం కొత్త బస్టాండ్ పక్కన వాటర్ ట్యాంకు లైన్ లో మంత్రి బుగ్గనకు స్థానిక హిజ్రాలు గుమ్మడి కాయతో హారతినిచ్చి దిష్టి తీశారు.అనంతరం క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు ఒకరితర్వాత ఒకరు మంత్రి విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆతర్వాత మంత్రి బుగ్గన నాగుల కట్ట వద్ద దండం పెట్టుకున్నారు. బయటిపేటలో మౌలాలి స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జెండాపేట, గౌరీపేటలో మంత్రి బుగ్గన పర్యటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చలంరెడ్డి, వైసీపీ నాయకులు బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.