4 అంశాలను లేఖలో ప్రస్తావించిన వైసీపీ
గుంటూరు బ్యూరో ప్రతినిధి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కించపరిచేలా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనాను రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ఈమేరకు వెలగపూడి సచివాలయం నందు గురువారం ఆధారాలతో ఫిర్యాదునందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ కూటమి నేతలకు ఏమాత్రం పట్టడం లేదని మల్లాది విష్ణు విమర్శించారు. ఈసీ ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు నోటీసులు అందించిందని.. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. మరలా మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం జగన్ ను సైకో అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు., బాబాయి గొడ్డలి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ధైర్యముంటే మా విధానాలు, పాలసీలపై మాట్లాడాలని.. అంతేగానీ ముఖ్యమంత్రి గూర్చి దిగజారి మాట్లాడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల బాబు రాజకీయ అనుభవం ఇందుకేనా..? అని ప్రశ్నించారు.
భయమనేని సీఎం జగన్ డిక్షనరీలోనే లేదు
భయమనేది సీఎం జగన్ డిక్షనరీలోనే లేదని.. రాష్ట్ర ప్రయోజనాల గూర్చి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎప్పటికప్పుడు కేంద్రంపైన పోరాడుతూనే ఉన్నామని మల్లాది విష్ణు అన్నారు. అధికారంలో ఉండగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాయని మండిపడ్డారు. 2014-19 మధ్య మీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు జరిగిన మంచి ఒక్కటైనా ఉందా..? కూటమి నేతలు సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదాను ప్యాకేజీగా మార్చడం, జాతీయ హోదా కలిగిన పోలవరాన్ని కమీషన్ల కోసం టేక్ ఓవర్ చేయడం.. ఇలా మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చివరకు మాపై బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కుట్రపూరితమైన మీ కలయికను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్నారని తెలిపారు.
దోషులను టీడీపీ భుజనాకెత్తుకోవడం సిగ్గుచేటు
రాజకీయాలలో విలువలు లేకుండా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా నర్సీపట్నం ప్రచార సభలో ముఖ్యమంత్రిని దుర్భాషలాడుతూ.. టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. తిరిగి పలకాలన్నా ఇబ్బందిపడే రీతిలో ఆయన మాట్లాడారని.. అధికారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదును అందించినట్లు తెలిపారు. అలాగే తెలుగుదేశం వాయిస్ మెసేజ్ లు, అసభ్యకర పాటలపై మరోసారి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మరోవైపు విజయవాడ నగరంలో సీఎం జగన్ పైన, సెంట్రల్ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ పైన దాడి ఘటనలో నిందితులను తెలుగుదేశం భుజానకెత్తుకుని మాట్లాడటం సిగ్గుచేటని మల్లాది విష్ణు అన్నారు. ఇప్పటికే 90 శాతం నిజాలు బయటకు వచ్చాయని.. ఎవరి కనుసన్నల్లో దాడి జరిగిందో ప్రజలకు గ్రహించారన్నారు. ఇదంతా వైసీపీ ఆడుతున్న డ్రామా అని బురదచల్లిన వారంతా.. ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ఉన్నారు.