ఎక్కడా సీటు లేదన్నాక డోన్ మీద ప్రేమ పొంగుకొచ్చిందా?
మీ ఊరెక్కడ? మీ ప్రస్థానమెక్కడ? మీ ఓటెక్కడ?
15 ఏళ్లు ప్రజలను వదిలేసిన మీరెలా అండగా ఉంటారో ప్రజలకు చెప్పాలి
డోన్ ఐదేళ్లలోనే మీరు గుర్తుపట్టనంత మారింది..ఊరు పేరు చెబితే ఒంటరిగా వెళ్లిరాగలరా?
డోన్ నంద్యాల పార్లమెంట్ లో కలిసిందే మీరు ఎంపీగా ఉన్నప్పుడు కాదా?
నాడు ఎంపీగా ఉండి డోన్ ను కలుపుతుంటే ఎందుకు ఆపలేదు?
నేడు ఒక్కటైన మీ కుటుంబాలు నాడే కలిస్తే ఎన్ని ప్రాణాలు బతికేవి?
ప్రజాస్వామ్యంలో పార్టీ కార్యకర్తల త్యాగం..ఎంతో అమూల్యం
ప్యాపిలిలో జరిగిన ‘ఆత్మీయ సమ్మేళనం’లో మంత్రి బుగ్గన
నంద్యాల బ్యూరో ప్రతినిధి: ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడినే గెలిపించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకు న్యాయం చేసిందా లేదా గత ప్రభుత్వాలతో బేరీజు వేసి చూసుకోవాలన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీ,వర్గాలకు అతీతంగా ఆలోచించి మరీ ఓటేయలన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, పింఛన్ పంపిణీ వంటి కార్యక్రమాలన్నీ పారదర్శకంగా అర్హులైన అందరికీ అందజేసిన ప్రభుత్వం మనదన్నారు.
టీడీపీది అబద్ధాల ప్రభుత్వం..మనది పేద ప్రజల ప్రభుత్వం
మహాలక్ష్మి పథకం పేరుతో రూ.25 వేలిస్తామన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు నమ్మి గతంలో మహిళలు మోసపోయారన్నారు. గ్యాస్ సిలిండర్లు అందిస్తామని అబద్ధాలు చెప్పి గెలిచాక ఒక్క సిలిండర్ ఇచ్చిన పాపనపోలేదన్నారు. విద్యార్థులకు బస్ పాస్ లు ఇవ్వాలన్నా రాయితీలతో ఆర్టీసీ నష్టపోతుందని మనసులో మాట పుస్తకం ద్వారా తన మనసులో మాట చెప్పారన్నారు. గతంలో పింఛన్లు, డీ-పట్టాల దగ్గర నుంచి ఏ ప్రభుత్వ సేవ అందాలన్న జన్మభూమి కమిటీల ద్వారా వేల లంచాలు తీసుకున్న చరిత్ర టీడీపీది అన్నారు. ప్యాపిలి పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది.
నాడు ఎంపీగా ఉండి డోన్ ను కలుపుతుంటే ఎందుకు ఆపలేదు?
డోన్ లో టీడీపీ అభ్యర్థికి అభివృద్ధి అంటే తెలియకుండా అభివృద్ధి చేస్తామని హామీలిస్తున్నారని మంత్రి బుగ్గన విమర్శించారు. ప్యాపిలిలో గ్రామగ్రామానికి ఇంటింటికి త్వరలోనే తాగునీరిస్తామన్నారు. ప్యాపిలిలోని చిట్టచివరి గ్రామాలకు కూడా మంచి రహదారులు నిర్మించామన్నారు. కేఈ, కోట్ల కుటుంబాలు కలవడమే విపక్షాల దృష్టిలో అభివృద్ధా అంటూ మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఊరూరా చిచ్చు పెట్టి, అమాయకులపై కేసులు పెట్టి, ఫ్యాక్షన్ తో రక్తపాతం సృష్టించి, మహిళలను ముండమోపులు చేయడమే వారు చేసే అభివృద్ధి అంటూ మంత్రి ధ్వజమెత్తారు. ఆపరేషన్ దుర్యోధన సినిమాలోలాగా డోన్ ను కర్నూలు జిల్లాలో కలుపుతామనడం అవగాహనరాహిత్యామన్నారు. 2009లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడే నంద్యాల పార్లమెంట్ లో డోన్ కలిపిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నాడు ఎంపీగా ఉండి ఏం చేయలేని మీరు ఇపుడు అధికారంలోకి వస్తే కర్నూలులో కలుపుతామనడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నించారు. 2009లో డోన్ ను నంద్యాల పార్లమెంట్ లోకలుపుతున్నప్పడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
ఊహించనంత అభివృద్ధి చెందిన ప్యాపిలిలో మీరు ఒంటరిగా వెళ్లి రాగలరా?
కేంద్ర రైల్వే మంత్రిగా కోచ్ ఫ్యాక్టరీ కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. అసలు కోట్ల ది ఏ ఊరో చెప్పాలన్నారు. ఆలూరా, ఆదోనా, కర్నూలా? కోడుమూరా? అని ప్రశ్నించారు. 1955లోనే స్వతంత్ర అభ్యర్థిగా తన తాత బీపీ శేషారెడ్డి నిలబడితే డోన్ ప్రజలు గెలిపించుకున్నారన్నారు. ప్యాపిలి ప్రజల కోసం విద్యాలయాలు, యువత కోసం ఇండోర్ స్టేడియం, ప్రజలకు తాగునీరు, ప్యాపిలి ప్రాంతానికి చెరువులు నింపి సాగునీరు అందించామన్నారు. నన్ను ఓడించడమే విపక్షనాయకుడి లక్ష్యమైతే ఇండోర్ గేమ్ లు ఆడుదాం రమ్మంటూ మంత్రి బుగ్గన ఛలోక్తి విసిరారు. అభివృద్ధి చేయడమే మీ లక్ష్యమైతే..మీకు అసలు ఆ ఉద్దేశముంటే మీ సొంత ఊరు లద్దగిరి ఎందుకు రోడ్డు వేయలేకపోయారో ప్రజలకు చెప్పాలని మంత్రి బుగ్గన అన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకూ మీ కుటుంబమంతా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది మా ప్రభుత్వం వేసిన రోడ్ల మీదేనన్నారు. ప్యాపిలిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.