విజయవాడ నగర సి.పి. రాణాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించిన సీఈఓ మీనా
అమరావతి, ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం రాయితో దాడిచేసిన ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నగర సి.పి. కాంతి రాణా టాటాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని తన ఛాంబరులో వారిరువురితో ఆయన సమావేశమై ఘనటనకు సంబందించిన పూర్వా పరాలపై సమీక్షించారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న “మేమంతా సిద్దం” బస్సు యాత్రలో ఇటు వంటి దుర్ఝటన ఏ విధంగా చోటు చేసుకుంది, దాడి చేసేందుకు నిందితులకు ఏ విదంగా అవకాశం ఏర్పడింది, పూర్తి స్థాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ నిందితులు ఏ విధంగా రాయితో దాడిచేయగలిగారనే విషయాలపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ ఘటనకు సంబందించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కొంతమంది నిందితుల విచారణ ఏ విధంగా సాగుతున్నది, ఆ విచారణలో బయటపడిని విషయాలపై ఆయన ఆరాతీశారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును మరింత వేగవంతం చేసి సమగ్ర నివేదికను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇటువంటి దుర్ఝటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలనే ఆవశ్యకతను చెపుతూ అందుకు తగ్గట్టుగా రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై ఆరాతీశారు. ఈ దుర్ఝటనకు సంబంధించిన పూర్వాపరాలు, ప్రస్తుతం జరుగుచున్న దర్యాప్తు ప్రగతిని వీడియో విజ్యువల్స్, ఫొటోల ద్వారా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.