చంద్రబాబు దారి అడ్డదారి
వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర
జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు..బాబుకు వేస్తే ముగింపు
కొనకొనమిట్ల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
ప్రకాశం జిల్లా నుంచి ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు..నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నారని కొనకనమిట్ల సభ వేదికగా ‘ఎల్లో బ్యాచ్’ కుట్రలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు దారి అడ్డదారి. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో మనం. జెండాలు కట్టి వాళ్లు. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని సీఎం జగన్ దుయ్యబట్టారు.
ఇది చంద్రబాబు మార్క్ రాజకీయం : వెన్నుపోట్లు, దగా, మోసం, అబద్దాలు, కుట్రలు చంద్రబాబు మార్క్ రాజకీయం. ఇంటింటికి అందుతున్న సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమా?. మన అడుగులు ముందుకా..వెనక్కా అని తేల్చే ఎన్నికలివి. చంద్రబాబుకు ఓటేస్తే జగన్ తెచ్చిన పథకాలకు ముగింపే. చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ పాతాళంలో ఉంటాయని సీఎం జగన్ ధ్వజమెత్తారు.
అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు : 56 నెలలుగా అందుకున్న పెన్షన్లను అర్ధాంతరంగా నిలిపివేయించాడు. ఆదివారమైనా, సెలవురోజైనా వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చేవారు. మండే ఎండలో పేదలను నడిరోడ్డుపై నిలబెట్టాడు. అవ్వాతాతలను చంపుతున్న నరహంతకుడు చంద్రబాబు. వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెత్తించింది. అందుకే వాలంటీర్లు లేకుండా చంద్రబాబు కుట్ర. తన రాజకీయం కోసం పేదల్ని చంపే చంద్రబాబు శాడిస్ట్ కాక ఇంకేంటి?. పేదలకు మంచి జరుగుతుంటే చూడలేని వాడే శాడిస్టు అంటూ చంద్రబాబుపై సీఎం జగన్ నిప్పులు చెరిగారు.
చంద్రబాబులో తగ్గని కడుపుమంట : అవ్వాతాతలను చంపిన చంద్రబాబును శాడిస్టు అనాలి. దళితులను అవమానించని వాడిని శాడిస్టు అనాలా? వద్దా?. మన ప్రభుత్వంలో మంచి జరుగుతోందని గీతాంజలి చెప్పడమే ఆమె చేసిన పాపం. తన మనుషులతో సోషల్‌మీడియాలో గీతాంజలిని వేధించి చంపారు. 20 జెలొసిల్ ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గని కడుపుమంట చంద్రబాబులో కనిపిస్తోంది. అసూయ, కుళ్లు, కడుపు మంటతో చంద్రబాబు బాధపడుతున్నాడు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకువస్తుందా?. మహిళల సాధికారితకు పెద్దపీట వేశాం. ఆక్వారైతులకు రూపాయిన్నరకే విద్యుత్ అందిచాం. వందేళ్ల తర్వాత భూముల్ని రీ సర్వే చేయిస్తున్నామని సీఎం జగన్ వివరించారు.
చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసు : ప్రతీ ఇంటికీ మంచి కోసం మనం అధికారాన్ని ఉపయోగించాం. మేం చేసిన పనులన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. చంద్రబాబు మాత్రం దోచుకోవడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారు. చంద్రబాబు చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. జన్మభూమి కమిటీలతో పేదలను ఇబ్బంది పెట్టారు. 2014లో ఈ ముగ్గురే కూటమిగా ఏర్పడ్డారు. ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు ఇంటింటికి కరపత్రాలు పంపించారు. 2014లో ఈ మూడు పార్టీలు ఏం హామీలిచ్చాయో అందరికి తెలుసు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. చేశారా?. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నెలకు రూ.2వేలు ఇచ్చారా?’’ అని సీఎం జగన్ నిలదీశారు.
విప్లవాలు మీ బిడ్డ పాలనలో సాగాయి : 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క స్కీం కూడా తీసుకురాలేదు. గ్రామ, వార్డు, సచివాలయాలంటే మీ జగన్..మీ బిడ్డ. గ్రామగ్రామాన విలేజ్ క్లీనిక్ అంటే.. మీ జగన్.. మీ బిడ్డ. ఇంటింటికి వాలంటీర్ల సేవలంటే మీ జగన్.. మీ బిడ్డ. అవ్వాతాతలకు పెన్షన్ అంటే మీ జగన్..మీ బిడ్డ. విప్లవాలు మీ బిడ్డ పాలనలో సాగాయి. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చాం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.25 లక్షలకు పెంచాం. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు.