బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని
విజయవాడ బ్యూరో ప్రతినిధి : పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని చెప్తున్న జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేదని, పేపర్ల ప్రకటనల కొరకు ఖర్చు చేయటం తప్ప ఇంకేమి చేయలేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. ఆదివారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి అమలు చేస్తోందన్నారు. డ్వాక్రా మహిళలకు అన్యాయం జరుగుతోందని, అంగన్వాడీలకు న్యాయం చేయలేక పోవటంసో పాటు వైసీపీ చేస్తున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ఏపీని డ్రగ్స్ గంజాయి రాష్ట్రంగా ప్రభుత్వం మార్చేసిందని, ప్రశ్నిస్తున్న వారిపై దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంటుందని, కొంత మంది పోలీసులు, అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని సాధినేని యామిని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. చేసేదంతా అధికారపార్టీ నేతలు చేసి తిరిగి ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘాలకి ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. జగన్ సొంత జిల్లా కడపకు వెళ్ళినప్పుడు 13 బలగాలను రప్పించుకున్నారని, సీఎంకు ప్రజల అండ ఉంటే ఎందుకు అంతలా బయపడుతున్నారని ప్రశ్నించారు.