ఘనంగా జర్నలిస్ట్ ల సంబరాలు
ప్రత్యేక ఆకర్షణ గా జబర్దస్త్ నటులు
మహిళలకు చీరలు పంపిణీ
అలరించిన సాంసృతిక కార్యక్రమాలు
విశాఖపట్నం బ్యూరో ప్రతినిధి : శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది తెలుగు ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపాలని విఎంఆర్డిఏ చైర్మన్ సనపల చంద్రమౌళి ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రైల్వే న్యూకాలనీ షింకా గ్రాండ్ హోటల్లో జర్నలిస్ట్ ల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఉగాది సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రానున్న ఉగాది పండుగ మన తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలన్నారు. పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు అంతా ఒకే చోట కలిసి ఉగాది సంబరాలు జరుపుకోవడం ఆనంద దాయకమన్నారు. పాత్రికేయ వృత్తిలో ఉన్న ఒత్తిడులను అధిగమించేందుకు ఇలాంటి సంబరాలు ఉపయోగ పడతాయన్నారు. పంచాంగ శ్రవణం చేసిన పురోహితులు శర్మ తమ పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండి రాష్ట్రం, దేశం సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పారు. 12 రాశులకు సంబంధించిన రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను వివరించారు. పల్సర్ బైక్ ఝాన్సీ, ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రమేష్ తమ నృత్య ప్రదర్శనలతోను జబర్దస్త్ హాస్య నటుడు రాపెటి అప్పారావు తన హాస్య స్కిట్లతో ఆహూతులను అలరించారు. మౌనిక ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం జర్నలిస్టుల కుటుంబాల్లోని మహిళలకు చీరలు, పంచాంగాలు పంపిణీ చేశారు.
గౌరవ అతిధులు గా మట్ట పల్లి హనుమంతరావు, సింకా జర్నలిస్ట్ లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు ఆద్యక్షత వహించి మాట్లాడుతూ సమాజం కోసం శ్రమించే జర్నలిస్ట్ లు, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు సంతోషమయమైన జీవితం గడపాలని, ఉగాది ఆనందమయం కావాలని ఆ సింహాద్రి నాధుడుని కోరుకుంటున్నానని, అన్ని పండుగలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. అర్బన్ అధ్యక్షులు పి. నారాయణ మాట్లాడుతూ అందరి సహకారం తో తమ యూనియన్ లు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ కార్య వర్గ సభ్యులు జి. శ్రీనివాస్ రావు, బ్రాడ్ కాస్ట్ అర్బన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వర్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లు డి. రవి కుమార్, సాంబ శివరావు బందరు శివప్రసాద్, కోశాధికారి మూర్తి, సీనియర్ జర్నలిస్ట్ లు అర్. నాగరాజ్ పట్నాయక్, కిల్లి ప్రకాష్ రావు, ఆనంద్, ఆయా ప్రాంతాల జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.