రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకు బ్యూరో ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అందిస్తున్న పాలనకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు నీరాజనాలు పడుతూ వైఎస్సార్సీపీ కుటుంబంలో చేరుతున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలిలో టీడీపీ, జనసేన పార్టీల నుంచి మంత్రి కారుమూరి సమక్షంలో ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో మావారికి మాత్రమే మంచి జరగాలని ఆదేశాలు జారీచేశారని, కానీ మీ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అర్హతే ప్రామాణికంగా కులం, మతం, పార్టీ బేధాల్లేకుండా అన్ని వర్గాలకు మంచి చేయాలని చెప్పారని గుర్తుచేశారు. నాకు ఓటేయని వారికి కూడా నేను ముఖ్యమంత్రిని కాబట్టి అందరికి మంచి జరగాల్సిందేనని ఇందులో ఎటువంటి మార్పులు ఉండబోవని అధికారయంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అదే స్ఫూర్తితో వలంటీర్లు అర్హత ఉంటే చాలు వారికి ఏ పథకం వర్తిస్తుందో గుర్తించి వారికి లబ్ది చేకూర్చారని అన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో పేద ప్రజలను జలగల్లా పిప్పి పీల్చేశారని, కానీ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిప్పుల్లా పనిచేశారని ప్రశంసించారు. టీడీపీకి, వైఎస్సార్సపీకి ఉన్న తేడాను ప్రజలు గుర్తించాలని, ఎవరు మనకు మంచి చేశారనే విషయాన్ని ఆలోచించుకోవాలని కోరారు. రామన్నపేటలో టీడీపీ, జనసేన పార్టీల నుంచి 50 కుటుంబాలు, మట్టపర్తి గరువులో 40 కుటుంబాలు, చినపేటలో 30 కుటుంబాలు మంత్రి కారుమూరి సమక్షంలో పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న, ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణిప్రసాద్, అత్తిలి మండల అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ. అత్తిలి సర్పంచ్ గంటా విజేత, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్లు కూనపరెడ్డి జయరాజు, కందుల సత్యనారాయణ, గోగులమ్మ పేట నాయకులు సిసిని నాగేశ్వరరావు, దాసరి శ్రీనివాస్, రామన్నపేట నాయకులు రంభ సూరిబాబు, రంభ సుజాత, రంభ రాంబాబు పాల్గొన్నారు.