73,74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధం
సొంత రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం వలంటీర్ల వ్యవస్థ
సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధానకార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్
విజయవాడ నుంచి ప్రత్యేక ప్రతినిధి : వలంటీర్ల వ్యవస్థను శాశ్వతం చేయాలని కోరుకుంటున్న అధికార పార్టీ విధానం తిరోగమన చర్య కాగా , కొద్దిపాటి మార్పులతో అదే వ్యవస్థను కొనసాగించాలన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ విధానం అవకాశవాదంతో కూడినదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేర్కొంది. ఆ మేరకు సంస్థ ప్రధానకార్యదర్శి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ వలంటీర్ల వ్యవస్థ హానికరమైనదన్నారు. చట్టవిరుద్ధమైనదని, అనైతికమైనదని, అందువల్లనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ దాన్ని తొలినుండీ వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలన్న ఏకైక ఉద్దేశ్యంతో సొంత రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని, రెండున్నర లక్షల మంది వలంటీర్లు అధికారపార్టీ కార్యకర్తలు ,సానుభూతిపరులన్న విషయాన్ని అధికారపార్టీ నేతలు పదే పదే నిస్సిగ్గుగా , మొండిగా ప్రకటిస్తూ రావడం గత నాలుగేళ్లుగా చూస్తూనే ఉన్నామన్నారు. వలంటీర్ల వ్యవస్థ వల్ల ఏటా దాదాపు రెండువేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల నెత్తి మీద పడిందన్నారు.
73,74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధం : దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వ్యవస్థ లేకపోయినా ఆయా రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి ముంగిటికి అందుతున్నాయన్న అంశాన్ని ఇటీవల రాష్ట్ర హైకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా పేర్కొన్నదన్నారు. అధికారాల వికేంద్రీకరణ ఉద్దేశ్యంతో చేసిన 73,74 రాజ్యాంగ సవరణల స్ఫూర్తికి విరుద్ధంగా గ్రామ , వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఈ వలంటీర్లు కూడా నియమితులయ్యారన్నారు. గ్రామ పంచాయతీలలోనూ, పురపాలక సంఘాల్లోనూ ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు జవాబుదారిగా లేరని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆర్టికల్ 16 కు , సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వలంటీర్ల నియామకం జరిగిందన్నారు. తమ రాజకీయ యాజమానుల ప్రయోజనాలను నెరవేర్చడానికి వలంటీర్లు ఓటర్లను భయపెట్టడం, బలవంతం చేయడం, ప్రలోభ పెట్టడం లాంటి చర్యల ద్వారా రాష్ట్రంలో వాతావరణాన్ని చెడగొట్టారని, అయినప్పటికీ పాలకపక్షం వలంటీర్ల అక్రమచర్యలకు ప్రజామోదం పొందటానికి వీలుగా వారిని భుజానికి ఎత్తుకుని నిస్సిగ్గుగా ప్రచారం సాగిస్తున్నదన్నారు.
వలంటీర్ల అక్రమాలకు తిరుపతి ఉపఎన్నిక ఉదాహరణ : 2021 మునిసిపల్ ఎన్నికల సందర్భంగా చాలాచోట్ల వలంటీర్లు పలు అక్రమ చర్యలకులకు పాల్పడ్డారని, తీవ్రమైన ఆంక్షలు విధించడం ద్వారా వలంటీర్ల అవినీతికర చర్యలను అరికట్టడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పట్లో విజయవంతం అయ్యిందన్నారు. 2021 లో జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక వలంటీర్ల కుమ్మక్కుతో దాదాపు 35 వేల దొంగఓట్లు పోలైనాయన్న సంగతిని భారత ఎన్నికల సంఘం కూడా గుర్తించింది. వలంటీర్ల అక్రమాలకు తిరుపతి ఉపఎన్నిక ఒక ఉదాహరణ గా నిలుస్తుందని, ఇటీవల రాష్ట్రంలో ఓటర్ల జాబితాల తయారీలో వలంటీర్లను వినియోగించడం జరిగిందని తెలిపారు. వారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిష్పాక్షిక స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలన్న ఉద్దేశ్యంతోనే ఎన్నికలకు సంబంధించిన పనులకు వలంటీర్లను దూరంగా ఉంచాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఎన్నికల కమిషన్ ను కోరిందని వెల్లడించారు.
అధికార పార్టీ కార్యకర్తలుగా వలంటీర్లు : అధికారపార్టీ కార్యకలాపాలలో వారు పాలు పంచుకోవడం, అధికారపార్టీ అభ్యర్థుల వెంట తిరుగుతూ ఓట్లు అభ్యర్ధించే కార్యక్రమంలో భాగస్వాములు కావడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు వలంటీర్లు పాల్పతూ వచ్చారు. అభ్యంతరాలను పట్టించుకోకుండా వలంటీర్లు అధికార పార్టీ కార్యకర్తలుగా పనిచేయడం కొనసాగుతూ వచ్చింది. అందువల్లనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయాల్సి వచ్చింది. దానిపై హైకోర్టు స్పందించి అధికారపార్టీ రాజకీయ కార్యక్రమాల్లో , ఓటర్లను కలుసుకునే కార్యక్రమాల్లోనూ , పింఛను పంపిణీలోనూ వలంటీర్లను దూరంగా ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు సరైనవే అయినప్పటికీ వాటిని నిలిపి వేయాలంటూ స్టే కోసం చేసిన ప్రయత్నాలను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా పింఛన్ల పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. వయోవృద్దులకు, దివ్యాంగులకు, ఇంటిదగ్గరే పింఛన్లు అందచేయాలని కూడా తన ఆదేశాల్లో ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పిందని, ఈ విషయంలో రాష్ట్ర అధికార యంత్రాంగం విఫలం కావడం విచారకరమన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సుమారు 65 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రెండువేల కోట్ల రూపాయల మేరకు పింఛన్లు అంద చేస్తున్నారు. వారికి పింఛన్లు సకాలంలో అందచేయక పోవడం , ఇంటి దగ్గర ఇవ్వకపోవడం అంటే హైకోర్టు ఉత్తర్వులను , ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఖాతరు చేయకపోవడమే అవుతుందని, పింఛన్ల పంపిణీలో జరిగిన పాలనా వైఫల్యానికి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి పూర్తి బాధ్యత వహించాలన్నారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ డిమాండ్ చేస్తున్నదని, ఆమేరకు సంస్థ ప్రతినిధి బృందం త్వరలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని, భారత ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అధికారపార్టీ నేతల ప్రేరణతో తాజాగా రాజీనామాలు చేస్తున్న వలంటీర్లను పోలింగు బూతుల్లో ఏజెంట్లుగా అనుమతించరాదని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కోరుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షులు యల్.వి . సుబ్రహ్మణ్యం, కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, సభ్యులు జంధ్యాల శంకర్ పాల్గొన్నారు.