శిరోమణి అకాలీదళ్ (SAD) పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) మాజీ అధ్యక్షురాలు బీబీ జగీర్ కౌర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందన్న కారణంతో ఆమెను సస్పెండ్ చేసినట్లు పార్టీ సీనియర్ నాయకుడు సికందర్ సింగ్ మలుకా వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ బీబీ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. SGPC అధ్యక్ష పదవికి తాను మరోసారి పోటీ చేస్తానని ఇటీవల బీబీ జగీర్ కౌర్ పట్టుబట్టింది. దాంతో కొద్దిరోజుల క్రితం సీనియర్ నేతలు దల్జీత్ సింగ్ చీమా, సుర్జీత్ సింగ్ రఖ్రా ఆమెను పిలిపించి మాట్లాడారు. పార్టీ నియావళిని మీరవద్దని, అధ్యక్ష అభ్యర్థిత్వంపై పార్టీ నిర్ణయం తీసుకునే వరకు వేచిచూడాలని కోరారు. కానీ, బీబీ అందుకు ఒప్పుకోలేధు. తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు స్పష్టంచేశానని, ఇక తన నిర్ణయాన్ని మార్చుకోబోనని తెగేసి చెప్పారు. దాంతో పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. అంతేగాక ఎందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాల్సి వచ్చిందో రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.