వెలగపూడి బ్యూరో ప్రతినిధి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అడిషనల్ సీఈవో కోటేశ్వరరావుకు సచివాలయంలోని ఆయన కార్యాలయంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం ఫిర్యాదు చేశారు. అలాగే పింఛన్లపై రెండో రోజు కూడా వాయిస్ మెసేజ్ ల ద్వారా తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారంపైనా చర్యలు తీసుకోవలసిందిగా లేఖలో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వాస్తవాలను వక్రీకరించడం, ప్రజలను అబద్దాలు ప్రచారం చేయడం, ప్రభుత్వంపై బురదచల్లడంలో చంద్రబాబు దిట్ట అని మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం చేయడం బాబు సిద్ధాంతమని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా పలు వెబ్ సైట్లు పోస్టులు పెడుతున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. కులాలు, మతాల ప్రస్తావన ఉండకూడదని ఎన్నికల నియమావళిలో స్పష్టంగా ఉన్నప్పటికీ టీడీపీ నేత జీవీఎస్ ఆంజనేయులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై ఓ చర్చిలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా అడిషనల్ సీఈవోకు ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నిష్పక్షపాతంగా పనిచేస్తున్న అధికారులపై పదేపదే ఫిర్యాదులు చేస్తూ తెలుగుదేశం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే బాలలకు రాజ్యాంగం కొన్ని హక్కులను కల్పించిందని,వాటిని పరిరక్షిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోందని మల్లాది విష్ణు అన్నారు. కానీ బాలల హక్కులు హరిస్తున్నట్లు టీడీపీ చేస్తున్న దుష్రచారంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అందించిన ఫిర్యాదులకు సంబంధించి తీసుకున్న చర్యలను తెలియజేయాలని అడిషనల్ సీఈవోను కోరినట్లు మల్లాది విష్ణు తెలిపారు. మరోవైపు పింఛన్ల పంపిణీని తెలుగుదేశం భగ్నం చేయడం కారణంగా ఆవేదనతో రాష్ట్రవ్యాప్తంగా పలువురు పింఛన్ దారులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.