విజయవాడ, బ్యూరో ప్రతినిధి : సామాజిక పింఛన్లను రద్దు చేసేందుకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ విమర్శించారు. ప్రజలకు ఇంటి వద్దనే సేవలందిస్తున్న వాలంటీర్ల పై కక్షతోనే చంద్రబాబు పెన్షన్ల పంపిణీకి అడ్డుపడి వృద్ధుల ఉసురు పోసుకుంటున్నారని ఘాటుగా ధ్వజమెత్తారు. ప్రతినెల ఒకటో తేదీని ఇంటికి వచ్చి తలుపు తట్టి పింఛన్లు అందజేసే వాలంటీర్లపై తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీలు కక్షగట్టాయని విమర్శించారు. కొత్త ప్రభుత్వం వచ్చేదాకా దాదాపు మూడు నెలల పాటు ఇంటి వద్ద పెన్షన్లు అందుకోలేక వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, రోగగ్రస్తులు, ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడేలా చంద్రబాబు అండ్ కో చేశారని ఆకుల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ వెనుక ఉన్న నిమ్మగడ్డ రమేష్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని, ఆ సంస్థ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేసి వాలంటీర్ ద్వారా పింఛన్లు పంపిణీ ఆపు చేయించారని వివరించారు. సకాలంలో పింఛన్లు రావనే బాధతో చిత్తూరు జిల్లా వెంకటగిరిలో ఒకరు, కాకినాడ రూరల్ లో ఒకరు పెన్షనర్లు మృతి చెందారని,ఈ మరణాలకు కారణం చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. పెన్షన్ల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు కూటమి అనుకోలేక పోయారని, అందుకే రానున్న రోజుల్లో చంద్రబాబు కూటమికి పెన్షన్ల నిలుపుదల భస్మాసుర హస్తంగా మారనుందని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు.