ఆత్మకూరు : ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి రూపొందించిన ప్రత్యేక మేనిఫెస్టో ను నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, పార్టీ ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలతో కలిసి మంగళవారం విడుదల చేశారు. ఈ మేరకు ఆత్మకూరులో పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మేనిఫెస్టోలోని పొందుపరిచిన అంశాలకు వివరిస్తూ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో పురాతన మసీదులు, దేవాలయాలు పునరుద్దరిస్తామని, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లు నిర్మిస్తామని అన్నారు. సంగం, ఎఎస్ పేట, చేజర్ల, మర్రిపాడు మండల కేంద్రాల్లో బస్టాండులు, కళ్యాణ మండపాలు, షాదీ మంజిల్, కమ్యూనిటీ హాల్లు నిర్మాణం, పాలిటెక్నిక్/ ఐటిఐ కాలేజీలు నిర్మాణం చేపడతామని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మెట్టు/ మాగాని పంటలు నిల్వ చేసుకునేందుకు మద్దతు ధర పొందేందుకు కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని, మౌలిక సదుపాయాలు కల్పించి, స్మశాన వాటికలు నిర్మాణం చేపడతామని అన్నారు. సెంట్రల్ లైటింగ్, డివైడర్, విశ్రాంతి గదులు, సైడ్ కాలువలు, ట్రాఫిక్ సంకేత బోర్డులు మొదలగు అదనపు మౌలిక సదుపాయాలు సంగం మండలం దువ్వూరు జాతీయ రహదారి 67 నండి మర్రిపాడు మండలం బాట వరకు ఏర్పాటు. నిరుద్యోగ యువతకోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి పోటీ పరీక్షలు సిద్ధం చేయడం, నియోజకవర్గంలో 5వేల మంది నిరుద్యోగుల కోసం జాబ్ మేళాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆత్మకూరులో జూనియర్, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు భవనాలు, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం నిర్మాణం చేపడతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
అనంతరం కార్యకర్తలనుద్దేశించి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియెజక వర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటని, మేకపాటి కుటుంబం నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజాసేవలోనే ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విక్రమ్ రెడ్డిని, ఎంపీగా తననూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో సంక్షేమం అభివృద్ధి అందించడంలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయికి పరిపాలన తెచ్చి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ తెచ్చారని అన్నారు. మధ్యవర్తులు, దళారుల వ్యవస్థ సమూలంగా రూపుమాపేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం వంటి వినూత్న సంస్కరణలు తెచ్చి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అందించి సుపరిపాలనలో తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. దేశంలో ఏ ఇతర రాజకీయ పార్టీ, ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్దిలో ప్రగతి పథంలో నడిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.
బీజేపీలో కలిసిపోనున్న టీడీపీ, జనసేన : ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీజేపీలో కలిసిపోతాయని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. కేవలం కొద్ది సీట్లతో ఆ కూటమి ప్రతిపక్షంలో కూర్చుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని అది కూడా బయటనుంచి అంశాల వారీగా మాత్రమే మద్దతు ఇచ్చామని అన్నారు, కేవలం దురుద్దేశంతోనే చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెబుతున్నాడని, అయితే ఆయన సృష్టించిన సంపద ఆయన కుటుంబం కోసం, తన సామాజిక వర్గం కోసం మాత్రమేనని, రాష్ట్రంలోని పేద, బుడుగు, బలహీన వర్గాల కోసం కాదని అన్నారు. చంద్రబాబు 5 కేసుల్లో ఏ1గా ఉన్నాడని, 2 నెలల పాటు జైల్లో ఉన్నాడని, వేల కోట్లు ప్రజాధనం దోచుకొని విదేశాలకు తరలించాడని అన్నారు. బుడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేసింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
ప్రాణం ఉన్నంత వరకూ వైఎస్ కుటుంబంతోనే : వైఎస్ కుటుంబంతో తనది 40 సంవత్సరాల అనుబంధమని, చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేసిన అనంతరం వైఎస్ రాజారెడ్డి వద్ద పనిచేశానని, అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద పనిచేశానని అన్నారు. ఆ కుటంబం ఆశీస్సులతో రాజకీయాల్లోకి ప్రవేశించానని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నానని అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ కుటుంబంతోనే ఉంటానని అన్నారు.
పరిశ్రమ తెస్తాం : ఆత్మకూరు, ఉదయగిరి మండలాలు అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉద్యోగాల కల్పనకు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు వెలిగొండ టన్నెల్ నిర్మాణం పూర్తి చేసానని మాట్లాడుతున్నాడని, అయితే ఆయన కేవలం రెండు కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేయగలిగాడని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రాజక్టు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
పార్టీకి కార్యకర్తలే మూలస్థంబాలు : ఏ రాజకీయ పార్టీ అయినా సంతోషంగా ఉండేందుకు కార్యకర్తలే మూల స్థంబాలని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇప్పటికీ నిర్లక్ష్యం చేయదని, పుకార్లను తిప్పికొట్టాలని కోరారు. నామినేటెడ్ పదవుల్లో, 200 కార్పొరేషన్ పదవుల్లో, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇతర పదవుల్లో సామాజిక న్యాయం పాటించిందని అన్నారు. అంతకు ముందు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టో పొందుపరిచిన అభివృద్ధి అంశాలను వివరించారు. ఆత్మకూరు నుంచి వైఎస్ఆర్సీపీ కి అత్యధిక మెజారిటీ బహుమతిగా ఇవ్వాలని కోరారు. అంతకు ముందు సంగం జంక్షన్ నుంచి ఆత్మకూరు బైపాస్ వరకు కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, ఆత్మకూరు పట్టణ జేసీఎస్ కన్వీనర్ డాక్టర్ చిల్లకూరు ఆదిశేషయ్య, చేజర్ల మండల అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, అనంతసాగరం మండల అధ్యక్షురాలు సంపూర్ణమ్మ, మున్సిపల్ చైర్మన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్, కన్వీనర్లు మల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, బుర్ర సుబ్బిరెడ్డి, చిట్టమూరు జితేంద్ర నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.