ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లావాసి
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం
ఏజీఎమ్మెస్సీ నుంచి ఐఏఎస్ వైపు
అమెరికాలో భారత రాయబారిగా మూడేళ్లు
అంచలంచెలుగా ఉన్నత స్థానాలకు
విజయవాడ, ప్రత్యేక ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ కోత రవికుమార్ అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. సీనియర్ ఐఏఎస్ రవి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని సంతబొ మ్మాళి మండలం కోటపాడు గ్రామం. ప్రస్తుతం రవి అసోంలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రవి ప్రాథమిక విద్యాభ్యాసం కొత్తూరు కోటపాడులో జరిగింది. హైస్కూల్ విద్యాభ్యాసం దండుగోపాలపురంలో, ఇంటర్మీడియట్ టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివారు. బాపట్లలో ఏజీబీఎస్సీలో సీటు రావడంతో చేరారు. ఆ తరువాత బాపట్లలోనే అగ్రికల్చర్ ఎమ్మెస్సీ, కొన్నాళ్ల తరువాత ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (న్యూఢిల్లీ)లో పీహెచ్‌డీని పూర్తిచేశారు.
అసిస్టెంట్ కమిషనర్ స్థాయి నుంచి : కోత రవి తన మొదటి పోస్టింగ్ కింద అసోంలోని గొసాయిగాంలో అసిస్టెంట్ కమిషనర్‌గా విధుల్లో చేరారు. ఆ తరువాత జ్వరాఘాట్, సివసాగర్ జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. అలాగే అసోంలో అగ్రికల్చర్ జాయింట్ సెక్రటరీగా, న్యూఢిల్లీలోని మానవ వనరుల శాఖ, గనులశాఖల మంత్రుల వద్ద ఓఎస్డీగా పనిచేశారు. దక్షిణ భారత్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థలో సీనియర్ రీజనల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం అమెరికాలో మినిస్టరీ ఆఫ్ ఎకనమిక్స్ విభాగంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధిగా విధులు నిర్వహించారు. అస్సాం ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న సమయంలో ప్రణాళికా సంఘం, నోట్ల రద్దు మరియు వ్యాట్ నుండి జీఎస్టీ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల ప్రభావం రాష్ట్రంపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అసోం ప్రాంతంలో ఐఏఎస్‌గా ఎక్కువకాలం విధులు నిర్వహించడం వలన ఆ ప్రాంత ప్రజానీకంతో అనుబంధం ఏర్పడింది. అస్సాం ప్రభుత్వం తరఫున ఊల్ఫా తీవ్రవాదులతో చర్చలు జరపడంలో కోత రవికుమార్ కీలక భూమిక పోషించారు. జ్వాలాగాట్లో ప్రజల భాగస్వామ్యంతో ఆసుపత్రి, జైలు నిర్మాణం చేయించి డబుల్ రోడ్లు, సోడియం వేపర్ లైటింగ్స్ ఏర్పాటు చేశారు. బ్రహ్మపుత్ర నదిపై ఆరువేల కోట్ల రూపాయల ప్రపంచబ్యాంక్ నిధులతో వంతెన నిర్మాణానికి కృషి చేశారు. డాక్టర్ రవికుమార్ నిర్వహించిన ప్రతీ శాఖలోనూ ప్రక్షాళనలు చేపట్టి ఆర్థిక పురోగతికి కృషి చేశారు. అలాగే రాష్ట్రంలోని చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి కీలక భూమికను పోషించారు. ఆదాయ మార్గాలు, అందుకు ప్రభుత్వ చేయాల్సిన సాధన, అంతర్గత వనరులు, మార్కెట్ రుణాలపై రవి కుమార్ మంచిపట్టు సాధించారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలతోనే రాష్ట్రంలోని ప్రైవేటు వాణిజ్య, వ్యాపార పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం చేయూతనిచ్చింది. తన ప్రణాళికలతో ప్రయివేటు పెట్టుబడులను సమీకరించి ఆర్థిక పురోగతికి దోహదపడ్డాయి. డాక్టర్ రవి రాష్ట్ర వార్షిక బడ్జెట్లను సిద్ధం చేయడంలో సిద్ధహస్తులు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంలో కీలక మార్పులను సూచించడం ద్వారా మంచి పేరుప్రఖ్యాతలు సాధించారు. అస్సం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రవి బహుబాషా కోవిదులు. ఆయన తెలుగు, హిందీ ఇంగ్లీషు భాషలతో పాటు అస్సామీ, బెంగాలీ భాషల్లోనూ మంచి ప్రావీణ్యం ఉంది. రవి సోదరులు భీమారావు అమరావతిలోని హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తుండగా, మరో సోదరుడు కోత మధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అసోం సీఎస్‌గా పదవీ బాద్యతలు చేపట్టడంపై పలువురు శ్రీకాకుళం జిల్లా వాసులు, డాక్టర్ రవి స్నేహితులు, పలువురు జర్నలిస్టులు ఆయనకు అభినందనలు తెలిపారు.