ప్రతి ఫిర్యాదుపైనా ప్రత్యేక దృష్టిపెట్టాం
1,235 ఎన్నికల ఫిర్యాదుల్లో ఇప్పటికే 1,213 ఫిర్యాదులను పరిష్కరించాం
జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ : జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎన్నికల కోడ్) సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఇప్పటి వరకు వివిధ మార్గాల ద్వారా 1,235 ఫిర్యాదులు రాగా వాటిలో 1,213 ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని, మిగిలినవి పురోగతిలో ఉన్నాయని కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు తెలిపారు. సోమవారం కలెక్టర్ ఢిల్లీ రావు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఎన్నికల ఫిర్యాదుల పరిష్కార ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, కోడ్ ఉల్లంఘనలతో పాటు ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై వస్తున్న ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నాటి నివేదిక ప్రకారం ఓటర్ హెల్ప్‌లైన్ (1950) ద్వారా 66 ఫిర్యాదులు రాగా అన్నింటి పరిష్కారం పూర్తయిందన్నారు. అదే విధంగా నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్జీఎస్పీ) ద్వారా 818 ఫిర్యాదులు రాగా.. 815 ఫిర్యాదుల పరిష్కారం పూర్తయిందన్నారు. అదే విధంగా వాట్సాప్ నంబరుకు 17 ఫిర్యాదులు రాగా 14 ఫిర్యాదులు, కాల్ సెంటర్ 18 ఫిర్యాదులు రాగా 18 ఫిర్యాదులు, కంప్లయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎంఎస్)కు 27 ఫిర్యాదులు రాగా 24 ఫిర్యాదులు, సీఈవో మెయిల్స్ ద్వారా 26 ఫిర్యాదులు రాగా 15 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. సీ-విజిల్ ద్వారా 263 ఫిర్యాదులు రాగా 261 ఫిర్యాదులు పరిష్కారం పూర్తయిందన్నారు. వివిధ మార్గాల ద్వారా అందిన ఫిర్యాదుల్లో పరిష్కారం పూర్తికాగా మిగిలిన వాటి పరిష్కార ప్రక్రియ వివిధ దశల్లో ఉందని, ఎప్పటికప్పుడు ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం; నివేదికల నిర్వహణ వ్యవస్థలపై సమీక్షిస్తూ వీలైనంత త్వరగా ఫిర్యాదుల పరిష్కారం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మీడియాలో 43 ప్రతికూల వార్తలకు సంబంధించి 31 వార్తలపై ఇప్పటికే తగు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి వివిధ అనుమతుల కోసం ఎన్కోర్ ద్వారా వచ్చిన 44 దరఖాస్తుల్లో 30 దరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు.