హైదరాబాద్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ నివాసంలో వారికి పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి వారికి కాంగ్రెస్ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని స్టేషన్ ఘన్పూర్ టికెట్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కడియం శ్రీహరికి ఇచ్చి గెలిపించిన విషయం తెలిసిందే. అందేవిధంగా ఆయన కుమార్తెకు వరంగల్ ఎంపీ టికెట్ కూడా ఖాయం చేశారు. అయితే ఆయన తన కుమార్తెతో కలిసి హస్తం పార్టీలో చేరారు. కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దని ఆ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి రావడంపై అభ్యంతరం తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ మాట్లాడుతూ కడియం గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశారని, తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని శాపనార్థాలు పెట్టి ఇప్పుడు పార్టీలోకి వస్తే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రమాదంలో పడ్డట్లేనని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ టికెట్ తన కూతురు కావ్యకు ఇప్పించి అసలైన కాంగ్రెస్ నాయకులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.